ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, హైదరాబాద్ లో రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా, రాహుల్ గాంధీ పదే పదే, ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెచ్చారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని అనేక సందర్భాల్లో రాహుల్ హామీలు గుప్పించారు. సోమవారం శేరిలింగంపల్లి సభలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తామని, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్సేనని చెప్పారు. హైదరాబాద్‌లోని సెటిలర్లు తమ వెంటే ఉంటారని టీపీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదానే కాదని... ఏపీ హక్కులన్నింటినీ కాలరాశారని మండిపడ్డారు.
2004 నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. చెప్పానంటే చేస్తానని హామీ ఇచ్చారు. కర్ణాటకలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చామని, నిలబెట్టుకున్నామని రాహుల్ వెల్లడించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటిలో నిర్ణయం తీసుకుని తెలంగాణా ఇచ్చామని, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటిలో నిర్ణయం తీసుకున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రత్యేక హోదాతో పాటు, అన్ని విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ప్రతిఖాతాలో 15 లక్షలు వేస్తానని ప్రధాని మోదీ అబద్దాలు చెప్పారని, తాను అబద్దాలు చెప్పనన్నారు.
ఆంధ్రా మూలాలు ఉన్నవారిని ఆకట్టుకునే దిశగా శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని ప్రసంగించాలంటూ ఉత్తమ్ ప్రత్యేకంగా కోరారు. భౌగోళికంగా విడిపోయినా ఆంధ్రా, తెలంగాణ ప్రజలం అన్నదమ్ముళ్లమని, అన్నదమ్ములుగా విడిపోయాం.. మనమంతా ఒకటేనని రఘువీరా స్పష్టం చేశారు. తెలుగువారంతా ఒకటేనని, మోదీకి బుద్ధిచెబుతారని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి రాగానే ఏపీకి హోదా ఇస్తామని రాహుల్ భరోసా ఇచ్చారని కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, తెలుగు రాష్ట్రాలు బలంగా నమ్ముతున్నాయన్నారు. హోదా ఇస్తామన్న మోదీ ఏపీని మోసం చేశారన్నారు. ఏపీకి భరోసా ఇచ్చిన విభజన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని రఘువీరా చెప్పారు.