పోలవరం ప్రాజెక్టు పై గతంలో కేంద్ర పర్యావరణశాఖ ఇచ్చిన స్టే ఉత్తర్వుల నిలుపుదలను పొడగించాలని కేంద్ర మంత్రి హర్షవర్థన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. జులైలో ఈ స్టే ఉత్తర్వుల నిలుపుదల గడువు ముగుస్తున్నందున తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి ఫోన్ చేశారని జల వనరులశాఖ అధికారులు వెల్లడించారు. శాశ్వత ప్రాతిపదికన స్టే ఉత్తర్వులను నిలుపుదల చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వగా డిమాండుగా ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఒడిశాలో ప్రజాభిప్రాయ సేకరణ వెంటనే పూర్తి చేయాలని, పనులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన కోరుతున్నారు. స్టే ఉత్తర్వుల ఫైలు ప్రస్తుతం కేంద్ర పర్యావరణశాఖ వద్ద ఉంది. అయితే అక్కడి అధికారులు మాత్రం వింత సమాధనం చెప్తున్నారు. సంబంధిత కార్యదర్శి విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన రావడానికి మరో మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇది ఇలా ఉంటే, ఈ విషయంలో కూడా మోడీ వైఖరి పై రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేర్చకుండా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగిన టీడీపీ.. తుదకు ఎన్డీఏ నుంచీ బయటకు వచ్చేసింది. కేంద్రంపై పోరాటం ప్రారంభించింది. దరిమిలా బీజేపీ, టీడీపీ రాజకీయంగా కత్తులు దూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో.. లోక్సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు జరపాలని కాంక్షిస్తున్న మోదీ ఆలోచనలతో ఒడిసా సీఎం నవీన్ ఏకీభవించారు. ఇటీవల బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నా.. ఆయన మాత్రం ఆ పార్టీలతో కలవలేదు. కాంగ్రెస్, బీజేపీలకు దూరం పాటిస్తూనే ప్రధానికి సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు. దీంతో.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపాలంటూ నవీన్ రాసిన లేఖకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించే అవకాశం లేకపోలేదు.
చంద్రబాబుపై కక్షసాధింపు ధోరణితో ఉన్న మోదీ ప్రభుత్వం... స్టే ఆదేశాలను పొడిగించకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుందేమోనన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులూ లేకుండా.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2018 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా రాష్ట్ర బీజేపీ నేతలు ఎంతవరకు సహకరిస్తారన్న సందేహాలు రేగుతున్నాయి. వాస్తవానికి పోలవరం నిర్మాణానికి సంబంధించి రాష్ట్రం చేసిన వ్యయంలో ఇంకా రూ.1995 కోట్లు కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. అయితే.. కేంద్రం నుంచి పూర్తిగా నిధులన్నీ వచ్చేశాయని, పెండింగ్లో ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర నేతలు గత రెండ్రోజులుగా అసత్య ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. ఇప్పుడు నిర్మాణ పనుల నిలిపివేతపై స్టే విషయంలోనూ మోదీ రాజకీయంగా వ్యవహరిస్తే పోలవరం పనులు స్తంభించిపోతాయని, ప్రాజెక్టు ముందుకు నడవకుండా బ్రేకులు పడిపోతాయని రాష్ట్రప్రభుత్వం ఆందోళన చెందుతోంది.