విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సమాజ్‌వాదీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ కేంద్రాన్ని కోరారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై రాజ్యసభలో చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో దిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఆయన సభకు గుర్తు చేశారు. విభజనల వల్ల ఆయా రాష్ట్రాల్లో అనేక సమస్యలు నెలకొంటున్నాయని వివరించారు. పంజాబ్, హరియాణా విడిపోయినా ఇప్పటికీ నదీ జలాల విషయంలో కత్తులు దూసుకుంటున్నాయని చెప్పారు.
సట్లేజ్ నది నీళ్లు హరియాణాకు చేరడంలేదని తెలిపారు. కృష్ణా, గోదావరికి సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య గొడవలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా కల్గిన ఉత్తరాఖండ్‌లో ఎలాంటి సౌకర్యాలూ లేవన్నారు. ఉత్తరాఖండ్‌లో వాహనాలు లోయలో పడే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా ఒక్కటి కూడా ట్రామా సెంటర్ లేదన్నారు. ఏపీ రాష్ట్ర విభజన సమయంలో కూడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని కోరినట్టు ఆయన గుర్తు చేశారు.
దేశంలో కొన్ని రాష్ట్రాల విభజన జరిగిన సమయంలో మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీని అన్ని రకాలుగా ఆదుకొంటామని ప్రధానమంత్రి ఇచ్చిన హమీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇస్తామని ఇచ్చిన హమీని కూడ కేంద్రం నిలుపుకోలేదని టీడీపీ ఎంపీలు తనకు ఇచ్చిన బుక్లెట్లలో ఉందని రామ్ గోపాల్ యాదవ్ అభిప్రాయపడ్డారు.