మంత్రి పదవి స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నారా లోకేష్ ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజున మాట్లాడిన మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు శాసనసభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానమిచ్చారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణంపై ప్రశ్నోత్తరాల్లో భాగంగా లోకేష్ సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా లోకేష్ మొదట మాట్లాడుతూ, "వేలాది రైతుల త్యాగాల పై నిర్మితమవుతున్న "మన రాజధాని - మన అమరావతి" గడ్డ మీద నుంచుని మాట్లాడటం గర్వంగా ఉంది" అంటూ ప్రసంగం ప్రారంభించారు... ఏపీలోని ప్రతి గ్రామపంచాయితీలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యమన్నారు. 2019లోపు అన్ని గ్రామ పంచాయితీల్లో భవనాలు, ఎల్ఈడీ లైట్లు, సిమెంట్ రోడ్లు, తాగునీటి సమస్యలేకుండా చేయడం, అంగన్వాడీకు భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు... పేదలకు పక్కా గృహాలు ఉండాలన్నది దివంగత నేత నందమూరి తారక రామారావు కల అని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాంగ్రెస్ హయాంలో 472 గ్రామ పంచాయితీ భవనాలు ఉంటే కేవలం మూడున్నరేళ్లలో 1628 భవనాలు నిర్మించామని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడిగా రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఉన్నప్పటికీ మన గడ్డ నుంచి మనమే పరిపాలించాలని అతి తక్కువ సమయంలో అసెంబ్లీని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు, సీనియర్ సభ్యుల సాహాచర్యంతో సభలో భాగస్వామ్యం కావడం అదృష్టమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.