శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నగారా మోగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి శాసనమండలికి మార్చిలోగా జరిగే ఎన్నికకు అప్పుడే హడావుడి మొదలైంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఓటర్ల నమోదు మొదలుకావడంతో అభ్యర్థులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలయ్యారు. ఈ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కృష్ణాజిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకుడు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తుంటే, గుంటూరు జిల్లా నుంచి జడ్పీ మాజీ చైర్మన్ రాయపాటి శ్రీనివాస్, గ్రంథాలయాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాజా మాస్టారు రేసులో ఉన్నారు. అయితే టిడిపిని ఎలా అయినా ఓడించటానికి, పీడీఎఫ్ తో కలిసి పని చెయ్యాలని, వైసీపీ, జనసేన ఒకటవుతున్నాయి.
టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మూడు చోట్ల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు జరిగా యి. రెండు చోట్ల టీడీపీ ఓటమి చెందగా, విశాఖ సీటును టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ దక్కించుకుంది. కాంగ్రెస్, వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పట్టభద్రుల ఎన్నికల్లో బలమైన అభ్యర్థికి ఆ పార్టీలు మద్దతును ఇస్తున్నాయి. 2019 మా ర్చిలోగా జరగనున్న పట్టభద్రుల ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రాజధాని జిల్లాలు కావటంతో వచ్చే ఎన్నికల్లో ఈ సీటును దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఎన్నికలకు ఓటు నమోదు చేయించుకో నున్నారు. పార్టీ రహిత ఎన్నికలైనందున ప్రత్యక్షంగా పార్టీ అభ్యర్థిని నిలపటమా? లేక చిగురుపాటి వంటి సేవా రంగ అభ్యర్థినే బలపర్చటమా? అనేది ఆ పార్టీ ముందున్న ప్రశ్న.
రెండు జిల్లాల్లో 25 వేల మంది ఉపాధ్యాయులు ఉండడంతో పట్టభద్రుల ఎన్నికలో వారి పాత్ర కీలకం కానున్నది. ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు నిలబెట్టే అభ్యర్థినే వామపక్షాలు కూడా బలపర్చే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థిని ఓడించటానికి వైసీపీ, జనసేన ఒకటయ్యాయి. అయితే బీజేపీ మాత్రం ఒంటిరిగా పోటీకి సిద్ధమైంది. 2019లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఎన్నిక జరుగుతుండటంతో ప్రజల్లో కూడా ఆసక్తి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ కూడా వ్యూహరచన చేస్తోంది.