రాజధాని నిర్మాణం కోసం తనపై నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగన్ అడిగితే రైతులు సెంటు భూమి కూడా ఇచ్చేవారు కాదని వ్యాఖ్యానించారు. మహానాడులో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ అమరావతికి ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలు వచ్చాయన్నారు. ఎంతోమంది ముందుకు వచ్చి రాజధానికి విరాళాలు ఇస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రూ.42 వేల కోట్లు అవసరమని, రూ. 22 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని చెప్పారు. రాజధానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చి లెక్కలు అడుగుతోందని.. ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
యూసీలన్నీ స్వీయధృవపత్రాలు అంటూ అవాస్తవాలు చెబుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లడమే అమిత్ షా లక్ష్యమని చంద్రబాబు మండిపడ్డారు. రూ.98 వేల కోట్లతో గుజరాత్లో కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారని, అమరావతికి రూ.1500 కోట్లు ఇచ్చి చాలంటున్నారని అన్నారు. అనుమతులు కూడా ఇవ్వబోమని బెదిరిస్తున్నారని సీఎం తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర పెద్దలు అవహేళనగా మాట్లాడుతున్నారని, నిధులన్నీ అమరావతికే ఖర్చు పెడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు తెచ్చి రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని, అమరావతి నుంచి ఆదాయం వచ్చాక అప్పులు తీరుస్తామని మహానాడులో చంద్రబాబు పేర్కొన్నారు.
తక్కువ వ్యయంతో నాణ్యమైన నిర్మాణాలే లక్ష్యంగా రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను చిన్నారులు.. విదేశాల్లో ఆర్జించిన సంపాదనలో కొంత మొత్తాని ఎన్నారైలు సైతం విరాళాలుగా రాజధాని నిర్మాణం కోసం ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు రూ.75 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తెలిపారు. రాజధానిలో రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసిన అనంతరం 5 వేల ఎకరాలను విక్రయించుకుని రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకునే అవకాశముందని సీఎం తెలిపారు. రాజధాని నిర్మాణం అంటే గిట్టని, నచ్చని వ్యక్తులు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఆఖరు నిమిషంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మారిన ఓ వ్యక్తి.. బీజేపీకి అద్దె మైకు, వైకాపాకు సొంతమైకులా మాట్లాడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. వీరి కుట్రలను ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు.