గ్రామ దర్శిని కార్యక్రమానికి సిఎం చంద్రబాబు సోమవారం నుంచి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు, దోనేపూడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. దాదాపు ఆరు నెలల పాటు కొనసాగే గ్రామదర్శిని కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 75 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. నెలకు మూడు నుంచి నాలుగు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రజలకు వివరించడం, గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయడం, మొక్కలు నాటడం తదితర పనుల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లేందుకు సిఎంతో పాటు టిడిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే గ్రామదర్శిని కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గ్రామదర్శిని కార్యక్రమానికి అధికారులు కచ్చితంగా హాజరు కావాలని ఆయన ఆదేశించారు. అధికారులు వారానికి రెండు రోజులు గ్రామదర్శినిలో పాల్గొనాలన్నారు. అధికారులు బుధ, గురు వారాల్లో గ్రామదర్శిని కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రతి సోమ, శనివారాల్లో కార్యాలయాల్లో విధులకు హాజరు కావాలని ఆయన అన్నారు. అవసరమైతే గ్రామాల్లో బస చేసి సమస్యలపై అవగాహన పెంచుకోవాలని, పెండింగ్ సమస్యలపై వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని, జనవరిలో జరిగే జన్మభూమి గ్రామసభల్లో విజన్ డాక్యుమెంట్ ప్రకటించాలని ఆయన అన్నారు. ఆరు నెలలపాటు ఈ కార్యక్రమం జరిపేలా ప్రణాళిల రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
గ్రామ దర్శినిలో ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించాలని, అర్హులైన వారికి ఇంకా ప్రభుత్వం నుంచి అందవలసిన సంక్షేమ పథకాలను అందించేందుకు, వాటిపై అవగాహన కల్పించేందుకు గ్రామ దర్శిని దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రతి సోమవారం, శనివారం కచ్చితంగా రెగ్యులర్గా విధులకు తమ కార్యాలయాలకు హాజరుకావాలన్నారు. బుధ, గురువారాల్లో గ్రామదర్శిని కార్యక్రమాలలో పాల్గొనాలని, గ్రామ దర్శినిలో అధికారులు తమ శాఖలకు చెందిన సమస్యలను పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తారని తెలిపారు. ఆరునెలల పాటు ఈ కార్యక్రమం జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రణాళిక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.