పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, మోడీ చేసిన మోసాన్ని ఎండగట్టటానికి, తెలుగుదేశం పార్టీ మళ్లీ కేంద్రంపై అవిశ్వాస అస్త్రాన్ని సంధించింది. విభజన హామీల సాధన కోసం కేంద్రంపై పోరాటాన్ని తీవ్రతరం చేసిన తెదేపా మంగళవారం తాజాగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల నేతలతో భేటీ అయి తమకు మద్దతుగా నిలవాలని కోరుతూ చంద్రబాబు రాసిన లేఖను వారికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెదేపా ఎంపీ కేశినేని నాని మంగళవారం కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. రేపు జరిగే సభా కార్యకలాపాల జాబితాలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని చేర్చాలని కోరారు.
రాష్ట్ర విభజన హామీల సాధనే లక్ష్యంగా గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ వరుస బెట్టి అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినప్పటికీ టీఆర్ఎస్ హైకోర్ట్ కోసం, అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్డు కోసం చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో సభ ఆర్డర్‌లో లేదంటూ సభాపతి సుమిత్రా మహాజన్ చెప్పడం, సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేయడంతో వాయిదాల పరంపరతో సభా కార్యకలాపాలు స్తంభించిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంతో ఈ వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. మరో పక్క, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. సభా కార్యకలాపాలు సజావుగా నిర్వహించేందుకు విపక్షాలు సహకరించాలని కేంద్రం కోరింది.
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు విపక్ష నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో తెదేపా తన స్పష్టమైన వైఖరిని కేంద్రానికి వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలుచేసే విషయంలో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తాత్సార వైఖరినే ఇప్పటివరకూ అనుసరిస్తూ వస్తోందని తెదేపా ఎంపీలు చెప్పినట్టు సమాచారం. లుగేళ్లుగా ఎంత వేచిచూసినా, కేంద్రానికి ఎంతగా సహకరిస్తూ వస్తున్నా ఏపీకి అన్యాయమే చేశారు తప్ప ఎక్కడా రాష్ట్రాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. ఏపీకి న్యాయం జరగకుండా సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు తాము సహకరించేది లేదని కూడా స్పష్టంచేసినట్టు తెలిపారు. తాము పార్లమెంట్ ఉభయ సభల్లోనూ నిరసన కొనసాగిస్తామని, లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్నిప్రవేశపెట్టి తీరతామని చెప్పారు.