కందుకూరు సభలో అపశ్రుతి చోటు చేసుకుని, ఎనిమిది మంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరి కుటుంబాలకు సానుభూతి తెలిపి, అప్పటికి అప్పుడు చనిపోయిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికీ, చంద్రబాబు రూ.10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. అయితే చంద్రబాబుతో పాటుగా, ఇతర టిడిపి నేతలు కూడా, కార్యకర్తలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కందుకూరుమీటింగ్ లో చనిపోయిన కార్యకర్తల కుటుంబానికి టీడీపీ నేత శిష్ట్లా లోహిత్ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇస్తున్నట్టు లోహిత్ చెప్పారు. ప్రమాదవశాత్తు కార్యకర్తల మృతి బాధాకరం అని అన్నారు. ఇక కందుకూరు ఘటనలో మృతుల కుటుంబాలకు బొబ్బిలి టీడీపీ నేత బేబి నాయన కూడా ఆర్థిక సాయం ప్రకటించారు. చనిపోయిన మా పార్టీ కుటుంబ సభ్యులకు సానుభూతి చెప్తున్నామని చెప్తూ, మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు బొబ్బిలి టీడీపీ నేత బేబి నాయన.
news
కందుకూరు ఘటనలో మృతి చెందిన వారి అంత్యక్రియలన్నీ దగ్గరుండి చూస్తున్న చంద్రబాబు..
నిన్న రాత్రి కందుకూరులో జరిగిన ఘటన జరిగినప్పటి నుంచి చంద్రబాబు తీవ్ర భావోద్వేగంలో ఉన్నారు. నిన్న రాత్రి నడుచుకుంటూ హాస్పిటల్ కు వెళ్ళిన చంద్రబాబు, తీవ్ర విషాద స్వరంతో, జరిగిన విషాదాన్ని బహిరంగ సభలో చెప్పి, కుటుంబాలని ఆదుకుంటామని చెప్పారు. ఇక నిన్న రాత్రి నుంచి పోస్ట్ మార్టం ఏర్పాట్లు, అంత్యక్రియల ఏర్పాట్లు, అన్నీ చంద్రబాబు దగ్గరుండి చూస్తున్నారు. అందరి అంత్యక్రియలు టీడీపీ తరపున చేయనున్నారు. తొక్కిసలాటలో మరణించిన కార్యకర్తల అంత్యక్రియలకు పార్టీ ఇన్ఛార్జ్ లు, ఎమ్మెల్యేలు వెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఒక్కో నేతకు, ఒక్కో బాధ్యత ఇచ్చారు. పోస్ట్ మార్టం దగ్గర నుంచి, ఇంటికి వెళ్ళే వరకు, తరువాత అంత్యక్రియలు పూర్తి చేసే వరకు, కుటుంబ సభ్యులతో ఉండాలని తెలిపారు. వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం ఇవ్వాలని ఆదేశించారు. వారికి మనోధైర్యం ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. తాను కూడా స్వయంగా పాల్గుంటానని, ఈ రోజు కందుకూరులో జరిగే పార్టీ కార్యక్రమాలు అన్నీ రద్దు చేస్తున్నట్టు చెప్పారు.
కందుకూరు ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ
నిన్న కందుకూరులో జరిగిన దురదృష్ట సంఘటన పై ప్రధాని నరేంద్ర మోడి స్పందించారు. చనిపోయిన టిడిపి కార్యకర్తల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయాలుపాలు అయిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ప్రార్ధించారు. ఇక ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చనిపోయిన వారికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు పరిహారంతో పాటుగా, గాయపడినవారికి రూ.50 వేలు ఇస్తామని ప్రధాని మోడి తెలిపారు. దీనికి సంబంధించి, ప్రధాని మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. కందుకూరు ఘటనలో మృతి చెందిన వారికి సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేసారు.
కందుకూరు ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు...
కందుకూరులో చంద్రబాబు పర్యటన తొక్కిసలాట జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. కందుకూరు పోలీస్ స్టేషన్ లో 174 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసారు. నిన్న చంద్రబాబు మీటింగ్ జరుగుతున్న ప్రాంతంలో, ఊహకు మించి జనం రావటం, పోలీసులు చేతులు ఎత్తేయటం, అలాగే గుండంకట్ట ఔట్ లెట్ ఓపెన్ గా ఉండటంతో, అందులో జారిపడి, ఎనిమిది మంది టిడిపి కార్యకర్తలు మృతి చెందారు. కొంత మంది ఆ ఔట్ లెట్ లో పడటం, దాన్ని చూసి కంగారు పడి, తొక్కిసలాట జరగటం, సభ మొత్తం ప్రజలతో నిండి పోవటంతో, ఒకరుపై ఒకరు పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి కార్యకర్తలు చనిపోయారు. దెబ్బలు తగిలిన వారిని, చంద్రబాబు స్వయంగా హాస్పిటల్ లో చేర్పించి, చికిత్స అందించారు. వెంటనే బాధిత కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించారు.