బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసిన దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ కు ఏమి ఉపయోగమో తేలియదు కానీ, పవన్ క్రేజ్ ని ఉపయోగించి, బీజేపీ మాత్రం హడావిడి చేస్తుంది. ఇప్పటి వరకు బీజేపీతో పొత్తుతో పవన్ కళ్యాణ్ కు ఒరిగింది ఏమి లేదు. చివరకు ఒకసారి కూడా అమిత్ షాని కానీ, మోడీని కానీ కలిసి ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి, అజెండా గురించి చర్చించింది లేదు. ఇది ఒక పక్కన పెడితే, మొన్న జరిగిన, హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో, జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ చేసిన పని నచ్చక, పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధుల జాబితీ కూడా ప్రకటించారు. ఎంపీ అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, జనసేనతో మాకు పొత్తు లేదని తేల్చి చెప్పారు. చివరకు అమిత్ షా ర్యాలీలో కూడా, జనసేన జెండాలో తీసేయమని చెప్పిన వీడియో బయటకు వచ్చింది. చివరకు కిషన్ రెడ్డి చర్చలు జరపటంతో, ఆ వివాదం సమసిపోయి, పవన్ కళ్యాణ్ అభ్యర్ధులను వెనక్కు పిలిపించి, బేషరతుగా బీజేపీకి మద్దతు ఇచ్చారు. అయితే వెంటనే ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు నడ్డాని కలిసి, తమకు తిరుపతి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని కోరారు. తమ బలం గురించి వివరించారు. అయితే ఎంపీ టికెట్ పై బీజేపీ, జనసేన కలిసి ఒక కమిటీ వేసి, అభ్యర్ధిని నిలపాలని నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీకి అక్కడ పెద్దగా ఓట్లు లేకపోవటంతో, అందరూ టికెట్ జనసేనకే వస్తుందని ఊహించారు.
అయితే ఈ రోజు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ, తిరుపతిలో బీజేపీ అభ్యర్ధి నుంచుంటున్నారు అంటూ బహిరంగ ప్రకటన చేసారు. ఒక పక్క కమిటీ ఏది తేల్చకుండానే, సోము వీర్రాజు చెప్పేశారు. బీజేపీకి మద్దతుగా జనసేన ఉంటుందని అన్నారు. మరి దీని పై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే వారం క్రితం పవన్ తిరుపతిలో తుఫాన్ బాధితులను పరామర్శించిన సమయంలో, అక్కడ తన క్యాడర్ బలం చూపించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీకి 6 వేల కోట్లు వస్తే, జనసేన బలపరిచిన అభ్యర్ధికి 16 వేల ఓట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీకి 0.84 శాతం ఓట్లు వస్తే, పవన్ కళ్యాణ్ కు 6% ఓట్లు వచ్చాయి. ఏ విధంగా చూసుకున్న ఒక పొత్తులో ఉన్నప్పుడు, ఎంపీ లాంటి సీటు, బలం ఉన్న పార్టీకి ఇవ్వాలి. మరి బీజేపీ ఏ ఉద్దేశంతో అక్కడ జనసేనని కాదని తమ అభ్యర్ధిని నిలపాలని అనుకుంటుందో వేచి చూడాలి. అసలు కమిటీ నివేదిక రాక ముందే సోము వీర్రాజు తిరుపతిలో చేసిన ప్రకటన పై, జనసేనకు ముందే చెప్పారా ? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీని పై పవన్ స్పందిస్తే కానీ, జనసేన వైఖరి ఏమిటో తెలియదు.