వైకాపా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో.. టికెట్ దక్కని నేతలు ఆందోళనకు దిగారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌ను కాదని చివరి నిమిషంలో అక్కరమాని విజయనిర్మల పేరును ప్రకటించడంతో వంశీకృష్ణ అనుచరులు వైకాపా నగర కార్యాలయం వద్ద ఫ్లెక్సీలను చించేశారు. పూలకుండీలను పగలగొట్టారు. 16వ వార్డు వైకాపా మహిళా అధ్యక్షురాలు పద్మరాణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. విశాఖ లోక్‌సభ అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ కార్యాలయానికి వెళ్లి కుర్చీలు, టేబుళ్లు, అద్దాలను పగలకొట్టారు. భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఒత్తిడి కారణంగానే విజయనిర్మలకు సీటిచ్చారంటూ ముత్తంశెట్టి ఇంటి ముందు కూడా ఆందోళన నిర్వహించారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న డాక్టర్ రమణమూర్తికి కాకుండా శనివారం పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వడంతో రమణమూర్తి అభిమానులు స్థానిక వైకాపా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆందోళనల నేపథ్యంలో జగన్ వంశీకృష్ణతో ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్సీని చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ‘వైకాపా ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్నా. నాలుగేళ్లుగా సమన్వయకర్తగా ఉన్నా. ఆఖరు నిమిషంలో వేరొకరికి టికెట్ ఇచ్చారు. ఇక వైకాపాలో ఉండదలచుకోలేదు. సోమవారం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తా’నని వంశీకృష్ణ స్పష్టం చేశారు. పాలకొల్లులో రెండ్రోజుల కిందటే వైకాపాలో చేరిన డాక్టర్ బాజ్జీకి టికెట్ కేటాయించడంపై అక్కడ పార్టీ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆగ్రహించారు.
కార్యకర్తలతో మాట్లడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఐజయ్య (నందికొట్కూరు), జంకె వెంకటరెడ్డి (మార్కాపురం) ఆదివారం ఉదయం నుంచీ ఎవరికీ అందుబాటులోకి రాలేదు. పెద్దాపురంలో తోట వాణికి టికెట్ ఇవ్వడంపై అక్కడి పార్టీ సమన్వయకర్త దవులూరి దొరబాబు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. కొండపి టికెట్‌కు అశోక్ వద్ద డబ్బు తీసుకుని కూడా వైకాపా నాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వలేదంటూ కార్యకర్తలు వైకాపా జెండాలను తగలబెట్టారు. పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వడంతో అక్కడ పార్టీ సమన్వయకర్త రామనాధం బాబు వైకాపాకు రాజీనామా చేశారు. సోమవారమే తెదేపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.