తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ, కూటమికీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినంత మెజారిటీ రాదని ముంబైకి చెందిన ఓ ప్రముఖ మార్కెట్‌ విశ్లేషణా సంస్థ చెబుతోంది. కేంద్రంలో 2014లో ఏర్పడినట్లుగా సుస్థిర ప్రభుత్వం రావడం కష్టమేనని తేల్చింది. ఆ సంస్థ అంచనా ప్రకారం.. తాజా ఎన్నికల్లో బీజేపీకి 100కు పైగా సీట్లు తగ్గిపోనున్నాయి. 2014 ఎన్నికల్లో 282 సీట్లు గెలిచిన కాషాయ పార్టీ ఈ సారి 171 స్థానాలకు పడిపోనుందని ముంబై సంస్థ అంచనా వేసింది. గతంలో 54స్థానాల్లో గెలిచిన ఎన్డీయే మిత్రపక్షాలు, ఈసారి కేవలం 23 స్థానాల్లోనే గెలుపొందనున్నట్లు తేల్చింది. గత ఎన్నికల్లో లోక్‌సభలో ఎన్డీయే బలం 336కాగా.. ఈసారి అది 194కు పడిపోతుందని పేర్కొంది.

center 19052019

ఆ సంస్థ అంచనా ప్రకారం.. 193స్థానాలున్న దక్షిణ, తూర్పు భారతంలో ఎన్డీయేకు 29, యూపీఏకు 68, తటస్థ పార్టీలకు (గ్రూపు1) 61, గ్రూప్‌2కి 36; మధ్యభారతంలో ఎన్డీయేకు 69, యూపీఏకు 72 స్థానాలు; ఉత్తర భారతంలో ఎన్డీయేకు 64, యూపీఏకు 35, గ్రూపు3 పార్టీలకు 40; 29 స్థానాలున్న అసోం, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్డీయేకు 17, యూపీఏకు 12 సీట్లు వస్తాయి. ఇక యూపీలో ఎన్డీయేకు 35, కాంగ్రె్‌సకు 5, ఎస్పీకి 21, బీఎస్పీకి 17, పీఎస్పీకి2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తటస్థ పార్టీలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. వాటిని మూడు విభాగాలుగా చేసి సీట్ల సంఖ్యను అంచనా వేసింది. గ్రూపు-1లో టీడీపీ, టీఎంసీ, వామపక్షాలు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ), ఆప్‌.. గ్రూపు-2లో టీఆర్‌ఎస్‌, వైసీపీ, బీజేడీ, పీడీపీ, మజ్లిస్‌.. గ్రూపు-3లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీలను చేర్చింది.

center 19052019

ఈ పార్టీలన్నీ ఎన్నికల తర్వాతే తమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీటన్నింటికీ కలిపి 142 సీట్లు వస్తాయని అంచనా. అంటే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఇవే కీలకం కానున్నాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి వివిధ పార్టీల అధినేతలతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కేవలం 44సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని కాంగ్రెస్‌ పార్టీ.. తాజా ఎన్నికల్లో 149 స్థానాల్లో గెలవనున్నట్లు అంచనా వేసింది. కాంగ్రె్‌సతో పాటు మిత్రపక్షాలు కూడా మెరుగుపడనున్నాయి. యూపీఏ భాగస్వామ్యపక్షాలు 56 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసే అవకాశం ఉందని, మొత్తంగా యూపీఏ బలం 205కు చేరనుందని పేర్కొంది.

దాదాపు 22 ఏళ్ల కిందటి నాటి ఆ రాజకీయం కేంద్రంలో ఇపుడు పునరావృతమవుతుందా?. ప్రధాని నరేంద్ర మోదీని ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి ప్రధాని కానివ్వరాదని గట్టిపట్టుదలతో ఉన్న ప్రాంతీయ పక్షాలు.. 1996 నాటి ప్రయోగంపై దృష్టిపెట్టాయి. నిజానికి ఆనాడు వాజ్‌పేయి రాజకీయంగా బద్ధవిరోధులు లేరు. అలాంటి ఆయననే 13 రోజుల్లోనే గద్దె దింపేశారు. మరి మోదీ..? విపక్షాలన్నింటికీ ఆగర్భ శత్రువు. ఆయన పేరు చెబితేనే ప్రతిపక్షాలు భగ్గుమంటున్న పరిస్థితి. అందువల్లే మోదీని అసలు అధికారమే చేపట్టకుండా నిలువరించాలని భావిస్తున్నట్లు సమాచారం. నాడు యునైటెడ్‌ ఫ్రంట్‌ నిర్మాణంలో చొరవ చూపిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబే నేడు కూడా బీజేపీ-నిరోధక ప్రయత్నాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు.

delhi 1905209

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌తోనూ, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఎన్‌సీపీ, ఆప్‌, లెఫ్ట్‌ చీఫ్‌తోనూ చర్చలు సాగించారు. మోదీ మళ్లీ అధికారం చేపడితే వ్యవస్థల సర్వనాశనమే కాదు, తమ అస్తిత్వమూ ప్రమాదంలో పడుతుందన్న భయాలు ఈ పార్టీల్లో ఉన్నాయి. ఈ వ్యతిరేకత కేవలం మోదీకే పరిమితం కాబోదని, బీజేపీ మొత్తానికి వర్తిస్తుందని ప్రాంతీయ పక్ష సమన్వయ వర్గాలు తెలిపాయి. అంటే మోదీ స్థానే నితిన్‌ గడ్కరీ లాంటి ఆమోదయోగ్య, సాత్విక, అనుకూలుడైన నేతను బీజేపీ ప్రతిపాదించినా ఆమోదించరాదన్న అభిప్రాయం ఈ పార్టీల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఒక సర్వే ప్రకారం... డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, తెలుగురాష్ట్రాల్లోని ఒకట్రెండు పార్టీలకు కలిపి ఈసారి 120 పైచిలుకు స్థానాలు లభించవచ్చు. ఇవన్నీ కలిసి కాంగ్రెస్‌ మద్దతు తీసుకుని సర్కారు ఏర్పాటు చేయడం ఒక లక్ష్యం. కాంగ్రె్‌సకు, దాని మిత్రపక్షాలకు (యూపీఏకు) గనక 200+సీట్లు వస్తే ఇది సాధ్యపడదు. యూపీఏ గనక 160 దగ్గర ఆగిపోతే ప్రాంతీయపక్షాలదే పైచేయి కాగలదు. దీని చుట్టూనే ప్రస్తుత రాజకీయం తిరుగుతోంది.

delhi 1905209

రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మరో మాట ఏంటంటే... నరేంద్ర మోదీ వాజ్‌పేయిలాంటి వ్యక్తి కాదని! మెజారిటీ సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించి, రాష్ట్రపతి గనక తొలుత ఆయననే ఆహ్వానిస్తే ఇక ఆట పూర్తయినట్లేనని, ఒకసారి అధికారం చేపట్టాక మోదీ సులువుగా మెజారిటీ సాధించేస్తారని ఈ వర్గాలంటున్నాయి. నయానో భయానో పార్టీలను దారికి తెచ్చుకొనే సామర్థ్యం మోదీ-షాలకు ఉందని, వారు వాజ్‌పేయి మాదిరిగా విలువల చట్రం దాటనివారేం కాదని నిష్కర్షగానే అంటున్నారు. అందుకే ఆయనను ముందే నిరోధించే ప్రయత్నాలు సాగుతున్నాయని, మోదీ ఎత్తుగడలు పూర్తిగా తెలుసు గనకే పార్టీలు కూడా అప్రమత్తమవుతున్నాయని వినిపిస్తోంది. 23వ తేదీ సాయంత్రానికే ఈ ప్రయత్నాలు ఓ నిర్దిష్ట రూపు సంతరించుకోవచ్చని తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియగానే ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరాఖండ్‌కు రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ముందుగా ప్రధాని కేదారేశ్వరుణ్ణి సందర్శించుకుని, పూజలు చేశారు. తరువాత అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ నేపధ్యంలో ప్రధాని కేదార్‌నాథ్ సందర్శనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీటి మధ్యలో ఒక ఫొటోను చూసిన నెటిజన్లు... ప్రధానికి ఫొటో తీసిన ఫొటో‌గ్రాఫర్‌ను ట్రోల్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేదారనాథుణ్ణి పూజిస్తుండగా, ఒక కెమెరామ్యాన్ అతని ఫొటో తీయడంలో మునిగిపోయాడు. మోదీకి ఆయన ఫొటో తీస్తున్న విధానాన్ని గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో పలు కామెంట్లు చేస్తున్నారు.

kedarnath 19052019 2

మరో పక్క, మోదీ కేదార్‌నాథ్‌లోని ఒక పవిత్ర గుహలో ధ్యానం చేశారు. ప్రధాని ధ్యానం చేసిన గుహ కావడంతో దీని విశేషాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో కలుగుతోంది. ఈ గుహ అత్యంత పురాతననమైనదేమీ కాదు. కేదార్‌నాథ్ అభివృద్ధి బాధ్యతలను ప్రధాని తీసుకున్న తరువాత ఈ గుహ నిర్మాణం జరిగింది. ఈ గుహ పేరు ‘రుద్ర గుహ’. గత ఏడాదే ఈ గుహను నిర్మించారు. 12250 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు. దీనిలో భక్తులు ధ్యానంతో పాటు పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ గుహ ప్రాకృతికంగా ఏర్పడినదేమీ కాదు. ఈ గుహ గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్‌కు చెందిన టూరిజం ప్రాపర్టీ. కేవలం రూ. 3000 చెల్లించి ఈ గుహలో ప్రవేశం పొంది, మూడు రోజులపాటు ఉండవచ్చు. ధ్యానంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మించిన ఈ గుహలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. టాయిలెట్, విద్యుత్, టెలిఫోన్ తదితర ఆధునిక సదుపాయాలు సమకూర్చారు.

kedarnath 19052019 3

మోదీ కేదార్‌నాథ్‌లో ధ్యానానికి కూర్చోవడంపై కాంగ్రెస్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రశ్నలు ఎక్కుపెట్టారు. మోదీ తన చర్య ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారని నిలదీశారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో మోదీ ప్రార్థనలు చేయడం, సమీపంలోని గుహల్లో ధ్యానం చేయడం, కాషాయం శాలువాతో ఆయన ధ్యానం చేస్తున్న ఫోటోలను పత్రికలు, టీవీ ఛానెల్స్ ప్రసారం చేశాయి. 'ఇవాళ ఆయన కాషాయం ధరించి గుహలో కూర్చున్నారు. ఆయన ఏమి కావాలని కోరుకుంటున్నారో భగవంతుడికి తెలుసు. అందరి దృష్టి ఆయనపైనే ఉంది' అని గెహ్లాట్ అన్నారు. పోలరైజేషన్ తప్ప మోదీ చేసిందేమీ లేదని కూడా ఆయన చురకలు వేశాలు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా సైతం ట్విట్టర్‌లో తన అభిప్రాయం పంచుకున్నారు. 'భగవంతుడి స్థావరానికి వెళ్లేటప్పుడు నిజమైన భక్తుడు తన అహంకారాన్ని, దర్పాన్ని వదులుకుంటాడు. రెడ్ కార్పెట్ సదుపాయాలతో వెళ్లరు. మోదీజీ...మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను' అని సూర్జేవాలా ట్వీట్ చేశారు.

ఈ ఎన్నికల్లో తెదేపా నూటికి వెయ్యిశాతం గెలవబోతోందని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. దేశ భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జాతీయ స్థాయిలో ఎన్డీయేలో లేని పార్టీలతో ప్రత్యామ్నాయం ఏర్పాటుకి ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తాను ప్రధాని రేసులో లేనని ఆయన స్పష్టంచేశారు. శనివారం రాత్రి చంద్రబాబు కొందరు పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆదివారం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్న నేపథ్యంలో, పార్టీ అనుసరించాల్సిన విధానం ఎలా ఉండాలన్న దానిపై ఆయన దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకి తాను చేస్తున్న ప్రయత్నాలు, అక్కడ ఏ పదవీ ఆశించి చేయడం లేదని, ఈ విషయాన్ని పార్టీ నాయకులు వివిధ వేదికలపై మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పాలని సూచించారు.

cbn teleconf 19052019

దేశం, రాష్ట్ర ప్రయోజనాల కోసమో తాము పోరాడుతున్నామని, తెలుగు వారు గర్వపడే పనులే చేస్తున్నాం తప్ప, ఎవరూ తలొంచుకునేలా చేయడం లేదని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన పాత్రను, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా తాను నిర్వహిస్తున్నానన్నారు. ‘‘నాకు ప్రధాని అవ్వాలన్న కోరిక లేదు. దేశం బాగుపడాలన్న ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాం’’ అని తెలిపారు. 2014లో కొన్ని జాతీయ ఛానళ్లు ఎగ్జిట్‌పోల్స్‌లో వైకాపా గెలుస్తుందని చెప్పాయని, కానీ తెదేపా ఘన విజయం సాధించిందని ఆయన గుర్తుచేశారు.

cbn teleconf 19052019

ఆదివారం కూడా కొన్ని ఛానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌లో వైకాపా గెలుస్తుందని చెప్పే అవకాశం ఉందని.. కానీ, 23న వెలువడే ఫలితాల్లో గెలుపు తెదేపాదేనని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ, పింఛన్ల పెంపు వంటి పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ప్రతిపక్షాలు ఎన్ని విధాల అడ్డు పడాలని చూసినా ప్రకృతి మనకు సహకరించింది. మహిళలు తెదేపాకి ఏకపక్షంగా ఓట్లు వేశారు. ఓటింగ్‌ పెద్ద ఎత్తున జరగడం, క్యూల్లో గంటల తరబడి నిలబడి మరీ ఓట్లు వేయడం మనకు సానుకూలాంశాలు. మనమే గెలుస్తున్నాం’’ అని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

Advertisements

Latest Articles

Most Read