ఫణి పెను తుపాను తీరాన్ని గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో అలజడి నెలకొంది. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. తుపాను తీరంవైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం ప్రారంభమైన సమీక్ష సాయంత్రం వరకూ జరుగుతూనే ఉంది. ఈ రోజు రాత్రంతా చంద్రబాబు సచివాలయంలోనే ఉంటారనే సంకేతాలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి సచివాలయంలోనే చంద్రబాబు ఉన్నారు. ‘ఫణి’ తుపాన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు బాబు ఆరా తీస్తున్నారు. ప్రతి గంటకు తుపాన్ పరిస్థితిని ఆర్టీజీఎస్ సీఈవో బాబు, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్ సీఎంకు వివరిస్తున్నారు.
విశాఖపట్నంకు 159 కిలోమీటర్ల దూరంలో.. తూర్పు ఆగ్నేయ దిశగా ‘ఫణి’ సైక్లోన్ కేంద్రీకృతమైనట్టుగా ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందస్తు జాగ్రత్త చర్యలను చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పూరి వద్ద తుపాన్ తీరాన్ని దాటనున్నది. తుపాన్ తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంతాల్లో గంటకు 130 నుంచి 140 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంత మండలాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తుపాను కాస్తా సూపర్ సైక్లోన్‌గా మారటంతో శ్రీకాకుళం జిల్లాపై పెను ప్రభావమే చూపించబోతోంది. ఉత్తర శ్రీకాకుళం మండలాల్లో 130 నుంచి 140 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో 200 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. మరోవైపు విజయనగరం జిల్లాలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. వజ్రపు కొత్తూరు ,పలాస, మందస మండలాల్లో గాలుల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈదురు గాలుల కారణంగా కొన్ని మండలాల్లో ముందుస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో కొన్ని గ్రామాల్లో అంధకారం నెలకొంది. మరోవైపు ఈ తుపాను ప్రభావం ఒడిశాపై కూడా పడటంతో గురువారం రాత్రి నుంచే భువనేశ్వర్, కోల్కత్తా ఎయిర్‌పోర్టులను అధికారులు మూసివేశారు.