ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, వైసీపీ అరాచాకం సృష్టిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడ్డారు. సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం జనసేన అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సత్తెనపల్లి మండలం పాకాలపాడులో వైకాపా కార్యకర్తలు ఆదివారం అడ్డుకున్నారు. రెంటపాళ్లలో ప్రచారం ముగించుకుని పాకాలపాడు చేరుకున్న జనసేన ప్రచార రథం ఒక సామాజిక వర్గం అధికంగా ఉండే వీధిలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డిని దూషిస్తూ వైకాపా శ్రేణులు ఆయన వాహనం ముందుకొచ్చి నిరసన తెలిపారు. వైకాపాలోకి రాకుండా జనసేనలోకి ఎందుకు వెళ్లావంటూ నిలదీశారు. మా వీధిలోకి రావడానికి వీల్లేదంటూ రహదారిపై గీతగీసి నిరసన తెలిపారు. జగన్ అనుకూల నినాదాలు చేశారు. దీంతో సీఎం పవన్ అంటూ జనసైనికులు నినాదాలు చేయడంతో రెండు పార్టీల కార్యకర్తల నడుమ వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎన్నికల ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉందని, మీరు అడ్డుపడితే సహించబోమని వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు జన సైనికులపై, ఫొటోగ్రాఫర్ కోటేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగారు. జనసేన కార్యకర్త చల్లా హేమంత్ శ్రీనివాస్‌కు, అభ్యర్థి గన్‌మెన్ సుభానికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తలను సముదాయించి పంపారు. క్షతగాత్రుడు శ్రీనివాస్‌ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వైకాపా కార్యకర్తలు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాకాలపాడు వైకాపా కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అభ్యర్థికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జనసైనికులు పట్టణంలో రాస్తారోకో చేశారు.
మరో పక్క, కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామంలో ప్రచారానికి రాలేదని వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యకర్త, అతడి తల్లిపై దాడి చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గొర్రెల కాపరి అయిన రంగస్వామిని రెండు రోజుల కిందట వైకాపా నాయకులు తమ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు రమ్మని పిలిచారు. అతడు వెళ్లకపోవడంతో వారు రంగస్వామిపై ద్వేషం పెంచుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు వైకాపా కార్యకర్తలు ఆదివారం రాత్రి రంగస్వామి ఇంటికి వెళ్లి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అడ్డువచ్చిన అతడి తల్లి కిష్టమ్మపైనా దాడి చేశారు. గాయపడిన ఇద్దరినీ స్థానికులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నందవరం ఎస్సై మల్లికార్జున కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక గుంటూరులోనూ ఇదే పరిస్థితి. జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త పిచ్చయ్య యాదవ్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడిలో టీడీపీ కార్యకర్త పిచ్చయ్య యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. పార్టీ మారాలని ఆయనపై వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మాట వినకపోవడంతోనే పిచ్చయ్యపై దాడికి పాల్పడినట్లు తెలిసింది.