రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఒక ముఖ్యమంత్రి కలవడం ఇది తొలిసారి అని సీఎం చంద్రబాబు అన్నారు. కొద్దిసేపటి క్రితం సీఈవో ద్వివేదిని కలిసిన చంద్రబాబు ఎన్నికల సంఘం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖను ద్వివేదికి చంద్రబాబు అందజేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డలో డబ్బులు వెదజల్లుతున్నా పట్టించుకోలేదని ఎన్నికల కమిషన్‌పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తున్నామని, తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని, వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని ఈసీని కోరామని తెలిపారు. బ్యాలెట్ పద్ధతిలో ఓట్లను కౌంట్ చేయడానికి 6 రోజులు పడుతుందని సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఈసీపై మండిపడ్డారు.
డేటా చోరీ కేసులో ఐపీ అడ్రస్‌లు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో 25 లక్షలు ఓట్లు తీసేస్తే సారీ చెప్పి వదిలేశారని విమర్శించారు. దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్నారు. ఈసీ పరిధిలో లేకున్నా అధికారులను బదిలీ చేశారని, ఎలాంటి కంప్లయింట్ లేకపోయినా కడప ఎస్పీని బదిలీ చేశారని దుయ్యబట్టారు. సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీ చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలపై ఏకపక్షంగా ఐటీ దాడులు చేశారని, వైసీపీలో అవినీతిపరులు లేరా? ఎందుకు దాడులు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణలో రూ.8 కోట్లు పట్టుబడినా చర్యలు లేవని చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అభ్యర్థులు, నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా... అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్న స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఫారం - 7 దరఖాస్తులు చేసినవారిపై చర్యలు తీసుకోవడంలో ఈసీ విఫలమైందన్నారు. వైసీపీ ఎప్పుడు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం వెంటనే స్పందిస్తోందని.. ప్రతిపక్ష నాయకుడి నిరాధారణ ఆరోపణలకు ప్రాధాన్యమిస్తోందని బాబు విమర్శించారు. తరువాత సీఈవో బ్లాక్ ఎదుట ఆయన కొద్ది సేపు నిరసనకు దిగారు. నిరసనతో ఈసీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.