తన సర్టిఫికెట్లతో ఉన్న బ్యాగును పోగొట్టుకుని తిరిగి బ్యాగును దక్కించుకున్న ఓ తమిళనాడు వాసి ఎపిఎస్ ఆర్టీసికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కార్యాలయానికి మెయిల్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆర్టీసీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎపిఎస్ఆర్టీసీ బస్సులో చెన్నైకి ప్రయాణించిన తమిళనాడు వాసి తన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగును బస్సులో మర్చిపోయాడు. తొలుత కోయంబేడు, పొన్నేరి బస్టాండ్లలో బ్రాంచ్ మేనేజర్ల ద్వారా, తమిళనాడు ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా ఆర్టీసికి సంబంధించిన కాంటాక్ట్ వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఎపిఎస్ఆర్టీసి హెల్ప్లైన్ నంబరుకు ఫోన్ చేశారు.
దీంతో ఎపిఎస్ఆర్టీసి సిబ్బంది వెంటనే స్పందించిమ, బస్సు డ్రైవర్ నెంబరును, బస్సు ఉన్న ప్రాంతాన్ని ఆన్లైన్ ద్వారా ట్రేస్ చేసి సిబ్బంది ఇచ్చారు. దాంతో ఆ ప్రయాణికుడు తన బ్యాగును సురక్షితంగా తీసుకోగలిగాడు. ఎపిఎస్ఆర్టీసి బస్సుల్లో ఏర్పాటు చేసే జీపీఎస్ వ్యవస్థ ద్వారా, బస్సు ఎక్కడ ఉందో ట్రేస్ చేసే అవకాసం ఉండటంతో, వెంటనే బస్సు ఎక్కడ ఉందో కనిపెట్టారు. దీంతో ఆటను కృతజ్ఞత తెలుపుతూ, ఫేస్ బుక్ లో తన అనుభవం పంచుకోవటమే కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఎపిఎస్ఆర్టీసి సిబ్బంది ప్రశంసిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈమెయిల్ కూడా రాసి, తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఇలాంటి సంఘటనే మరొకటి కూడా జరిగింది. మరో సందర్భంలో, పరీక్షకు హాజరయ్యేందుకు ఆర్టీసీ సిబ్బంది సహకరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పరీక్షకు హాజరయ్యేందుకు బయలేరి, బస్సు సమయానికి చేరుకోలేక బస్సును మిస్సయ్యి నిస్సహాయ స్థితిలో ఉన్న తన కుమారునికి ఆర్టీసీ సిబ్బంది సహకరించడం పై ఓ తండ్రి ఆర్టీసి ఏండీలో ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 7న విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లేందుకు స్నేహితులిద్దరూ బస్సుల్లో సీట్లు బుక్ చేసుకున్నారు. ట్రాఫిక్ వల్ల బస్సు సమయానికి చేరుకోలేకపోయారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారు తాము చాలా ముఖ్యమైన పరీక్షకు వెళ్లాలనీ, ఎలాగైనా సాయం చేయాలనీ ఆర్టీసి కంట్రోలర్ లక్ష్మణరావును వేడుకున్నారు. సర్వీస్ బస్సులో ఎస్ఆర్ షీటులో నమోదు చేసి ఇద్దరినీ బెంగళూరుకు పంపారు. తన కుమారుడు పరీక్షకు హాజరయ్యేందుకు సహకరించిన ఆర్టీసికి మోహన్ ధన్యవాదాలు తెలుపుతూ ఉద్వేగపూరితమైన ఇమెయిల్ ను పంపినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అంకిత భావంతో వ్యవహరించిన కంట్రోలర్ లక్ష్మణరావును ఆర్టీసి ఏండీ సురేంద్రబాబు అభినందించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని సిబ్బంది అందరూ ప్రయాణికులకు సేవలందించాలన్నారు.