వైసీపీని వీడుతున్న ప్రతీ నేత చెప్పే కామన్ డైలాగ్ ఒకటేనన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదే వ్యక్తిస్వామ్యం. వైసీపీలో నియంతృత్వ పోకడలు పెరిగిపోయాయని.. జగన్ ఎవరి మాట వినడని.. తన మాట ప్రకారమే అందరూ నడుచుకోవాలనే మనస్తత్వం అతనిదని గతంలో పార్టీ మారిన నేతల్లో చాలామంది విమర్శించారు. ఇప్పుడు తాజాగా వైసీపీని వీడిన వంగవీటి రాధా కూడా ఇదే రకమైన ఆరోపణలు చేయడంతో ‘జగన్ వన్‌మ్యాన్ షో’పై మరోసారి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం గురువారం మీడియాతో మాట్లాడిన వంగవీటి రాధా జగన్‌పై చేసిన ఆరోపణలు ఈ చర్చకు కారణమయ్యాయి.
తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లినప్పుడు ‘ఎవడికి చెప్పి వెళ్లావు నువ్వు.. నీ ఇష్టమా.. నీ ఇష్టమొచ్చినట్టు వెళ్లిపోతే కుదురుతుందా.. ఇది నా పార్టీ’ అని జగన్ తనను హెచ్చరించారని రాధా వ్యాఖ్యానించారు. అయితే.. జగన్‌పై, వైసీపీపై వస్తున్న ఇలాంటి ఆరోపణలు, విమర్శలు కొత్తేమీ కావు. గతంలో వైసీపీని వీడిన మెజారిటీ నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, చెప్పిన సలహాలను పాటించే స్థితిలో జగన్ లేరని మాజీ మంత్రి మైసూరారెడ్డి వైసీపీని వీడిన సందర్భంలో వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కూడా వైసీపీని వీడిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వైసీపీలో తనకు కనీస గౌరవం దక్కలేదని.. ఆనం చేరిక గురించి జగన్ తనతో మాట మాత్రం కూడా చెప్పలేదని బొమ్మిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి.
జగన్ ఒక డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని, తాను చెప్పిందే అందరూ వినాలన్నదే జగన్ మనస్తత్వమని బొమ్మిరెడ్డి అప్పట్లో ఆరోపించారు. అంతేకాదు, వైసీపీని వీడి టీడీపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో జగన్‌కు రాసిన లేఖలో కూడా జగన్ నియంతృత్వం పోకడలు నచ్చకే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. జగన్‌కు ఎదుటి మనిషిని గౌరవించే సంస్కృతి లేదని, ఆయన వైఖరి నచ్చకే పార్టీకి రాజీనామా చేసినట్లు 22 మంది ఎమ్మెల్యేలు సంయుక్తంగా జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. వైసీపీలో జగన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఇలా పదేపదే వినిపిస్తుండటంతో ఆ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదనే అంశం స్పష్టమవుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా జగన్ వ్యవహార శైలిపై పదేపదే వస్తున్న ఇలాంటి ఆరోపణలు వైసీపీకి రాజకీయంగా నష్టం చేసే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.