వైసీపీ దాడుల్లో హత్యకు గురైన కార్యకర్తలకు టీడీపీ బాసటగా నిలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. కార్యకర్తలపై దాడులను ఖండిస్తూ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని చంద్రబాబు ప్రకటించారు. గాయపడిన కార్యకర్త సయ్యద్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని, మూడు వారాల్లోనే 100కి పైగా దాడులకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. అధికారపార్టీ దాడుల్లో ఐదుగురు కార్యకర్తలు మృతి చెందారని, వైసీపీ దాడుల్లో హత్యకు గురైన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. అధికార పార్టీ తక్షణమే దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తల మీద దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు చెప్పారు.
తెదేపా కార్యకర్తలపై ఇప్పటి వరకు వందకు పైగా దాడులు జరిగాయని.. వైకాపా జరిపిన ఈ దాడుల్లో ఐదుగురు తెదేపా కార్యకర్తలు మృతిచెందారని చంద్రబాబు వివరించారు. 72 మందిపై భౌతిక దాడులు, 25 మంది ఆస్తుల ధ్వంసం జరిగిందని చెప్పారు. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చినపుడు ఎక్కడా దాడులు జరగలేదన్నారు. దాడులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. గ్రామస్థాయి కార్యకర్తలకు నేతలు అండగా నిలవాలని చంద్రబాబు సూచించారు. తెదేపా ఐదుసార్లు గెలిచినా ఎప్పుడూ ఈరకంగా దాడులు చేయలేదన్నారు. వైకాపా దాడులను ఖండిస్తూ పెట్టిన తీర్మానానికి సమావేశంలో ఆమోదం తెలిపారు. దాడుల విషయమై సోమవారం డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు తెలిపారు.