తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి, కేంద్రం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ రాశారు. ఈ నెల 19న జరగనున్న ప్రత్యేక సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ పంపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఐదు కీలక అంశాలు చర్చించనున్నారు. పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు, ఒక దేశం - ఒకే ఎన్నికలు, 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం, మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి.. వీటిపై చర్చించేందుకు పార్లమెంటులో ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీల అధినేతలు హాజరుకావాలని ప్రహ్లాద్ జోషి లేఖలో పేర్కొన్నారు.
అన్ని పార్టీల నాయకులకు ఈ లేఖలు రాసినట్టు సమాచారం. మరి చంద్రబాబు ఈ భేటీకి హాజరవుతారో లేదో చూడాల్సి ఉంది. మరో పక్క, సోమవారం నుంచి పార్లమెంట్ సమాశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో, ఈ రోజు (ఆదివారం) ప్రధాని మోడీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని అన్ని పార్టీలను ప్రధాని కోరారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పలు పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గోన్నారు.