పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారిపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్‌వోసీ ఉన్నవారికి సరిహద్దులో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు.. ఆరోగ్యం బాగాలేకుంటే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎన్‌వోసీ తీసుకుని సమస్య పరిష్కరించాలని భాజపా నేత గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌వోసీ ఉన్నవారికి సరిహద్దులో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు.. ఆరోగ్యం బాగా లేకుంటే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్వారంటైన్‌కు వెళ్లే అవసరం లేదంటే వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపింది. వారిని హోం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కరోనాపై పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనా నివారణ చర్యలపై ఐదుగురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ వేసింది. మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబుతో కమిటీ ఏర్పాటు కానుంది. నిత్యం వైద్యశాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సూచించారు. కరోనా నివారణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు వివరించారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై జిల్లాకు రూ.2 కోట్లు కేటాయించారు.రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి కుదేలైందని మంత్రివర్గం అభిప్రాయపడింది. దేశానికి, రాష్ట్రాలకూ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

కరోనా నిరోధక చర్యలపై ఖర్చుకు వెనుకాడవద్దని సీఎం జగన్‌ సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిపైనా మంత్రివర్గం చర్చించింది. వసతి, భోజనం కల్పించేలా ఆయా రాష్ట్రాలతో మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా రాష్ట్రాలు ముందుకురాకుంటే వసతి ఖర్చు భరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. యాచకులు, అనాథలకు వసతి కల్పించాలని, కల్యాణమండపాల్లో భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. కరోనా వ్యాప్తిని నివారించవచ్చనే నమ్మకంతో జగ్గంపేటలో తన అనుచరులతో కలిసి వేపాకుకు నిప్పు పెట్టారు. వేపాకును గుట్టగా పేర్చి పెట్రోలు పోసి తగులబెడుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎమ్మెల్యే వెంటనే పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే తల వెంట్రుకలు కొద్దిగా కాలిపోయాయి. ఆయన ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, జుట్టు మొత్తం అంటుకునేది. అయితే ఘటన జరిగిన రెండు, మూడు నిమిషాలకు ఎమ్మల్యే తేరుకుని, మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కు నివారణ గా ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు వాల్ఎంట్రీలు వేప రొట్టను పొగవేసి ఇలా చేయడం వల్ల వైరస్ను నివారించొచ్చు అని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు చెప్పారు.

ఇక మరో పక్క, సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. 2020-21 బడ్జెట్ ఆర్డినెన్స్​ను మంత్రివర్గం ఆమోదించింది. లాక్‌డౌన్ పరిస్థితి, కరోనా నివారణ చర్యలపై మంత్రివర్గం చర్చించింది. నిత్యావసర వస్తువుల లభ్యత, అత్యవసర రవాణా పరిస్థితులపై మంత్రివర్గ భేటీలో చర్చించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 2020-21 బడ్జెట్ ఆర్డినెన్స్​ను మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పేర్ని నాని చెప్పారు. వచ్చే 3 నెలల కాలానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినట్టు వివరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా స్వీయనియంత్రణ విధించుకున్నామని మంత్రి పేర్ని నాని వివరించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 28 వేలమంది వచ్చారని పేర్ని నాని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోందని ఉద్ఘాటించారు.

అన్నిరకాల సరకు రవాణా వాహనాలను అనుమతిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కలెక్టర్‌ వద్ద రూ.2 కోట్ల అత్యవసర నిధి ఏర్పాటు చేశామన్న పేర్ని నాని... ఆక్వా రంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. మత్స్యరంగం ఎగుమతిదారులతో రేపు అత్యవసర సమావేశం ఉంటుందని వివరించారు. ఉపాధిహామీ, వ్యవసాయ కూలీలు సామాజిక దూరం పాటించాలని కోరారు. కరోనా నియంత్రణకు జిల్లా, నియోజకవర్గాల వారీగా టాస్క్‌ఫోర్సులు ఏర్పాటు చేసినట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు ప్రభుత్వ నిస్సహాయతను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని కోరారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సీఎం, సీఎస్‌ మాట్లాడుతున్నారన్న పేర్ని నాని... ఎవరు ఎవరితో తిరిగారో చెప్పలేం కనుక ఈ జాగ్రత్తలు తప్పవని పేర్కొన్నారు.

 

ఏపి తెలంగాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత రాత్రి నుంచి పడిగాపులు కాసి, సహనం కోల్పాయారు, విద్యార్దులు, ఉద్యోగులు. దాచేపల్లి మండలం, పొందుగుల చెక్ పోస్ట్ వద్ద పోలీసుల పై రాళ్ళ దాడి చేసారు ప్రజలు. దీంతో పోలీసులు కూడా వారి పై లాఠీచార్జ్ చేసారు. ఈ పరిణామంతో, పొలేసులు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చేతిలో డబ్బులు లేక, ఆకలితో, నిన్నటి నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నమాని ఆవేద వ్యక్తం చేసారు. హైదరాబాద్ లో పంపెసరని, సొంత ఊరికి వెళ్లి, ఎలా గోలా బ్రతుకుతాం అని అంటున్నారు. నిన్నటి నుంచి ఓపిక పట్టిన ప్రజలు, ఈ రోజు సాయంత్రం జగన్ ప్రెస్ మీట్ పెట్టి, ఎక్కడి వారు అక్కడే ఉండాలని, ఇక ఎవరినీ లోపలకు రానివ్వం అని చెప్పటంతో, బొర్డర్ లో ఉన్న ప్రజలు రెచ్చిపోయారు.

నిన్న మధ్యానం నుంచి అక్కడ పడిగాపులు కాసిన వారు, సహనం కోల్పాయారు. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు- ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంత మంది పోలీసులకు తలకాయలు పగిలాయి. అలాగే, పోలీసులు చేసిన లాఠీ చార్జ్ తో, ప్రజలకు కూడా గాయాలు అయ్యాయి. నిన్నటి నుంచి ఈ సమస్య పరిష్కారం చెయ్యకుండా, తాత్సారం చేస్తూ రావటంతో, చివరకు పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు మొండి పట్టుదలకు వెళ్ళటంతో, చివరకు పోలీసులు, ప్రజలు కొట్టుకునే దాకా పరిస్థితి వచ్చింది.

చీకటి పడటంతో, లైట్లు లేకపోవటంతో, ఎవరు దాడి చేసారో తెలియని పరిస్థితి. ఇరువురు దాడులు చేసుకోవటంతో, అక్కడ ఉన్న వాహనాలు కూడా దెబ్బ తిన్నాయి. ఎట్టకేలకు పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు. సరిహద్దులో ముళ్ళ కంచె వేసారు. ఎట్టి పరిస్థితి లోను, లోపలకు వదిలే ప్రసక్తే లేదని, తిరిగి తెలంగాణాకు వెళ్ళిపోవాలని, పోలీసులు అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే, ఎక్కడకి దారి తీస్తుందో చూడాలి. మరోవైపు ఏపీ- తెలంగాణ బార్డర్‌ గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద పరిస్థితి మెరుగైంది.

కరోనా సంక్షోభం దృష్ట్యా ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో సామాన్యులకు కాస్త ఊరటనిచ్చేలా కీలక చర్యలు చేపట్టింది రిజర్వు బ్యాంకు. టెర్మ్​ లోన్స్​ నెలవారీ వాయిదాల చెల్లింపుపై 3 నెలల మారటోరియం విధించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చింది. అంటే మూడు నెలల పాటు, ఈఎంఐ వాయిదా వేసుకోవచ్చు. వర్కింగ్ కేపిటల్​పై వడ్డీ చెల్లింపు ఆలస్యమైనా రుణ ఎగవేతగా పరిగణించరాదని సూచించింది. చెల్లింపుల్లో జాప్యం రుణగ్రహీత క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది.కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన చేశారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తీసుకుంటున్న మరిన్ని చర్యల్ని వెల్లడించారు.

ఇక మరో పక్క, కీలక వడ్డీ రేటును ఒకేసారి 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా రెపో రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. రివర్స్​ రెపో రేటు 90 బేసిస్ పాయింట్ల క్షీణతతో 4 శాతానికి చేరింది.కరోనా విజృంభణ, దేశవ్యాప్తంగా లాక్​డౌన్ వంటి పరిస్థితుల మధ్య ఈ అసాధారణ నిర్ణయాలను ప్రకటించారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్. మరికొద్ది రోజుల్లో జరగాల్సిన ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశాన్ని ఈనెల 25, 26, 27 తేదీల్లో ముందుగానే నిర్వహించినట్లు తెలిపారు. రెపో రేటు తగ్గింపు సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడతామని భరోసా ఇచ్చారు శక్తికాంత దాస్.

కరోనా సంక్షోభం... ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. 2019లో దశాబ్దపు కనిష్ఠానికి ప్రపంచ వృద్ధి రేటు పతనం కావడాన్ని గుర్తుచేశారు. 2020లో వృద్ధి కొంతైనా పుంజుకుంటుందన్న ఆశలు ఇప్పుడు ఆవిరైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి తీవ్రత, వేగం, ఎంత కాలం ఈ మహమ్మారి కొనసాగుతుందన్న అంశాలపైనే ప్రపంచ ఆర్థిక భవిత ఆధారపడి ఉంటుందని విశ్లేషించారు ఆర్​బీఐ గవర్నర్. ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయే ప్రమాదముందని అంచనా వేశారు.

Advertisements

Latest Articles

Most Read