ఈ రోజు నారా లోకేష్ ప్రెస్ తో మాట్లాడారు. ఐటీ రైడ్స్ జరిగింది చంద్రబాబు మాజీ పీ.ఎస్ శ్రీనివాస్ ఇంటిపై, టీడీపీ రాష్ట్రకార్యదర్శి రాజేశ్ ఇంటిపైనని, శ్రీనివాస్ ఇంటిలో రూ.2లక్షల 68వేలు దొరికితే, అవికూడా తిరిగిచ్చేయడం జరిగిందన్నారు. లోకేశ్ అకౌంట్ నుంచో, లేక ఇతరుల నుంచో డబ్బులు వచ్చినట్లు ఆధారాలుంటే ఐటీ శాఖ ఊరుకునేదా అని లోకేశ్ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈడీ రూ.43వేలకోట్లు జప్తుచేసిందని, వాటి గురించిగానీ, రూ.5ల విలువైనషేర్లను పెద్దఎత్తున ఎలా అమ్మారనేదానిపై ఎందుకు మాట్లాడటం లేదో తెలియడం లేదన్నారు. 1986లో హైదరాబాద్ లో 1100గజాలు కొన్న చంద్రబాబు రూ. 23లక్షల 20వేలు ఖర్చు చేశారని, అప్పటినుంచి ఇప్పటివరకు అక్కడున్నభూములధరలు పెరిగాయి కదా అని చెప్పిన లోకేశ్, మార్కెట్ లోధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయన్నారు. మేం ఎప్పుడు, ఎక్కడ, ఎంత ధరకు కొన్నామో, పూర్తి వివరాలతో సహా వెల్లడిస్తున్నామన్నారు. దొంగలెక్కలు రాసుకునే వైసీపీ బ్యాచ్, దొంగపేపర్, మేం చెప్పకపోయినా ఎలాగూ తప్పడులెక్కలతో రేపు కట్టుకథలన్నీ వండివార్చుతారని లోకేశ్ దెప్పిపొడిచారు.
ఏధరకు భూములు, షేర్లు, ఇతర ఆస్తులు కొన్నామో అదేధరను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. అవే ధరలను వైసీపీవారు కూడా ప్రకటిస్తే సంతోషిస్తామని, 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి తన ఆదాయం రూ.9లక్షలని ప్రకటించారని, అదేవ్యక్తి 2009కి వచ్చేసరికి రూ.43వేలకోట్ల ప్రజాధనాన్ని దోచేశారని లోకేశ్ మండిపడ్డారు. వ్యక్తిగతంగా తనకు, తన కుటుంబసభ్యులకు ఏవిధమైన ఆస్తులు లేవని, హెరిటేజ్ సంస్థ తరుపున మాత్రమే ఉన్నాయన్నారు. రాజధానిలోని 29గ్రామాల్లో ఎక్కడాకూడా తమకు ఒక్క గజం భూమిలేదన్నారు. రాజధానికి 30కిలోమీటర్ల దూరంలో 2014 మార్చిలో హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాలు కొనుగోలు చేసిందన్నారు. అదేసమయంలో విశాఖలో, తమిళనాడులో కూడా కొనుగోళ్లు చేసిందన్నారు. 2013లో బ్రాహ్మణి రూ.78లక్షల విలువైన షేర్లను కొనుగోలు చేశారని, అదే విలువను ఇప్పుడుకూడా ప్రకటించామన్నారు. దేవాన్ష్ పేరుతో జూబ్లీహిల్స్ లో ప్లాట్ కొన్నామని, 2018లో దానివిలువ రూ.18కోట్లని చెప్పారు. రాజధానిలో భూములు కొన్నవారంతా లోకేశ్ కు బినామీలైతే వారిపై ఎందుకు చర్యలుతీసుకోవడంలేదని లోకేశ్ ప్రశ్నించారు.
వైసీపీ ప్రజాప్రతినిధులు బయటకు వస్తే, ప్రజలు వారిపై తిరగబడే పరిస్థతి ఉందని, తాము తిరుగుతుంటే, వారంతా వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని లోకేశ్ తెలిపారు. మంగళగిరిలో తిరుతుగుతుంటే, పింఛన్లు, రేషన్ కార్డులకు సంబంధించి ఒక్కవార్డులోనే 70 ఫిర్యాదులు వచ్చాయని, వైసీపీపాలన ఎలా ఉందో చెప్పడానికి అదే నిదర్శనమన్నారు. 151 మందిని గెలిపిస్తే పరిపాలన ఎలా ఉండాలో, చివరకు ఎలా ఉందో తెలుసుకోవాలంటే వైసీపీనేతలు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. 9రకాల రద్దులు, 9రకాల మోసాలు, 9రకాల భారాలు ప్రజలకు తెలియచేయడానికే ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. జగన్మోహన్ రెడ్డి 30ఏళ్లపాటు అధికారంలో ఉంటాడని చెబుతున్న వైసీపీ బ్యాచ్, యాత్రను చూసి ఎందుకింతలా భయపడుతుందో తెలియడంలేదన్నారు. యాత్ర ఆరంభమైన రోజునే 15మంది మంత్రులు మీడియా ముందుకురావడం చూస్తే, వారెంతగా భయపడుతున్నారో అర్థమవుతోందన్నారు. 9నెలల్లోనే ముఖ్యమంత్రినే ప్రజలంతా తుగ్లక్ అని పిలిచే పరిస్థితికి ఎవరు కారణమో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఉండే నిర్ణయాలు అమలుకాకూడదన్న లక్ష్యంతోనే వైసీపీ పాలన సాగుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం ఏమిటని లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
పీ.ఎస్ గా పనిచేసిన వ్యక్తి దగ్గర ఏముంటాయి... చంద్రబాబు దగ్గర పీ.ఎస్ గా పనిచేసినంత మాత్రాన శ్రీనివాస్ దగ్గర ఏముంటాయో చెప్పాలని, తన బాస్ కుసంబంధించిన రోజువారీ పర్యటనలు, ఇతర కార్యక్రమాల వివరాలు తప్ప వారివద్ద ఏముంటుందో చెప్పాలని విలేకరులు అడిగిన ప్రశ్నకుసమాధానంగా లోకేశ్ డిమాండ్ చేశారు. ప్రతిశుక్రవారం కోర్టుకు ఎందుకు వెళుతున్నారో, రూ.43వేలకోట్ల సంగతేమిటో, ఇతర కేసుల విచారణ ఏమయిందో చెప్పకుండా, ఇతరులపై నిందలు వేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 9నెలల్లో ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచాడని, విలేకరులు తన అసమర్థతను ఎక్కడ ప్రశ్నిస్తారోనన్నభయంతోనే ఆయన వారి ముందుకురావడానికి భయపడుతున్నాడన్నారు. మాజీ పీ.ఎస్ శ్రీనివాస్ ఇంటిలో రూ.2వేలకోట్లు దొరికాయని చెప్పిన ఏ2, దొంగలెక్కలు రాయడంలో మంచిసిద్ధహస్తుడని, ఆపనిలేకపోవడంతో ఇప్పడు దొంగమాటలు చెబుతూ బతికేస్తున్నాడన్నారు. అవినీతిపరులకు అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తారని, ఈరోజు తాను ప్రకటించిన ఆస్తుల వివరాల కన్నా, ఎక్కడైనా ఒక్కరూపాయిగానీ, ఒక్క గజం భూమిగానీ, ఒక్కషేర్ గానీ ఎక్కువున్నట్లు నిరూపిస్తే, తమకున్న ఆస్తులన్నింటినీ నిరూపించినవారికే రాసిస్తానని, తాను విసిరిన ఈ సవాల్ కు ఏ1, ఏ2లలో ఎవరూ స్పందిస్తారో చెప్పాలన్నారు. ఎక్కడో ఐటీ రైడ్స్ జరిగితే, దానికి తెలుగుదేశానికి సంబంధమేంటని, దేశంలో అనేక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలున్నాయని, వాటన్నింటిని చంద్రబాబుకి, లోకేశ్ కు ముడిపెడితే ఎలా అని మాజీ మంత్రి ప్రశ్నించారు.