మందడంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు నుంచి సకల జనుల సమ్మెను రాజధానిలో రైతులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, ఈ రోజు మధ్యానం ఉన్నట్టు ఉండి, కొంత మంది మహిళలను పోలీసులు వచ్చి ఈడ్చుకు వెళ్ళటం, సంచలనంగా మారింది. ఇంత వరకు విద్యార్ధుల ఆందోళనలు, అరెస్ట్ లు, అలాగే రైతుల ఆందోళనలు, అరెస్ట్ లు మాత్రమే తెలిసిన ఈ దేశానికి, బహుసా మొదటి సారిగా, ఇలా ఆడవాళ్ళ పై, పోలీసులు ప్రవర్తించి ఉంటారు. అక్కడ మహిళా పోలీసులు, కొంత మంది మహిళల గొంతు నొక్కుతూ, లాగుతూ, చేతులు మెలేస్తూ ఉన్న వీడియోలు మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. అయితే మహిళలను అరెస్ట్ చెయ్యటం పై, పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, పోలీసులు ఈ మొత్తం ఘటన పై స్పందించారు. మేము ఎక్కడా మహిళల పై దాడి చెయ్యలేదని, కేవలం రోడ్డు పై ధర్నా చేస్తున్న మహిళలను తప్పించే ప్రయత్నం చేసామని అన్నారు. ఈ క్రమంలో కొన్ని గాయాలు అయ్యి ఉంటాయని, మేము కావలని అలా చెయ్యలేదని, ఏఎస్పీ చక్రవర్తి అన్నారు.
ఇది ఇలా ఉంటే, పోలీసులు చున్నీతో గొంతు నులిమిన మహిళ, కొంత సేపటికి సొమ్మసిల్లి పడిపోయింది. పోలీసులు గొంతు నులమటంతో ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు బాధితురాలి తరఫు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఇదే సందర్బంలో మరో మహిళా కళ్ళ జోడు పగిలి, ఆ అద్దాలు కంటిలో గుచ్చు కున్నాయి. అయితే, ఆ మహిళలను 108లో హాస్పిటల్ కు తీసుకు వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా, అక్కడ గ్రామస్తులు అడ్డుకుని, తమ వాహనాల్లోనే హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, తమ మేడల్లో ఉన్న గొలుసులు, మంగళసూత్రాలను కూడా పోలీసులు లాగేశారని ఆరోపించారు. తమలో ఎవరినో ఒకరిని చంపేసే ప్రయత్నంలోనే ఈ రోజు, పోలీసులు వ్యవహరించారని అంటున్నారు. మరో పక్క మహిళలను అరెస్ట్ చేసి, వారిని వ్యాన్ లో తీసుకు వెళ్తున్న సమయంలో, గ్రామస్తులు బస్సుకు అడ్డంగా పడుకున్నారు. ఈ సమయంలో, ఆ పడుకున్న వ్యక్తీ పై, వ్యాన్ చక్రం ఎక్కటంతో, అందరూ కంగారు పడ్డారు. పోలీసులు తమను చంపటానికే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని ఖండించిన చంద్రబాబు. రాజధానికి భూములిచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం హేయం. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నవాళ్లపై పోలీసు జులుం ప్రదర్శించడంపై మండిపడ్డ చంద్రబాబు. రైతులపైకి పోలీసు వాహనాలను నడిపి గాయాలపాలు చేయడం అప్రజాస్వామికం. వేలాది పోలీసులను గ్రామాల్లో దించి భయభ్రాంతులను చేస్తారా ? భూములిచ్చిన వాళ్ళను ఇంత దారుణంగా హింసిస్తారా ..?మహిళలను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తరలించడం అమానుషం. రైతులపై, మహిళలపై అక్రమ కేసులను తక్షణం ఎత్తేయాలి. రాజధాని గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. రైతులు, మహిళల్లో నెలకొన్న ఆందోళనలు తొలగించే చర్యలు చేపట్టాలి : ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు