అమరావతిపై ఒక సంచలన ప్రతిపాదన సిద్దమైంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ సర్కారు కసరత్తు చేస్తోంది. రాజధాని మార్పునకే మొగ్గు చూపుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అమరావతిని ప్రత్యేక వ్యవసాయ మండలిగా రూపుదిద్దాలని భావిస్తోంది. దీనిపై నియమించిన వ్యవసాయ నిపుణుల కమిటీ ప్రత్యేక వ్యవసాయ మండలిపై సిఫార్సులను సిద్ధం చేసింది. దీని ప్రకారం రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భవనాలు రోడ్లను అలాగే ఉంచి, మిగిలిన భూములను ఎస్ఎజడ్ పరిథిలోకి తేవాలనేది ఆ సిఫార్సు, దీని ప్రకారం ఇక్కడ నాణ్యమైన పంటల సాగుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన భూములనే కాక, ప్రభుత్వ భూములను కూడా ఎస్ఎజడ్ పరిథిలోకి తెస్తారు. విలువైన పంటల హబ్ గా అమరావతిని తీర్చిదిద్దాలనేది నిపుణుల సిఫార్సు చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ లో వీటిని స్వాధీనం చేసుకోవడానికి ముందు ఈ భూములలో రెండు నుంచి మూడు పంటలను పండించేవారని, అందుకే ఇప్పుడు ఇలా చేస్తే ఎలా ఉంటుందని వైసీపీ ప్రభుత్వంలో ఆలోచిస్తుంది.
2014లో ప్రభుత్వానికి రైతులు భూములు ఇచ్చారు. రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని కోసం, తమ భూములు త్యాగం చేసారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటుగా, తమ భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆశ పడ్డారు. ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్లో భవంతుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ, సెక్రటేరియేట్, హైకోర్టు భవనాలతో పాటు మంత్రుల నివాస సముదాయాలను కూడా నిర్మించారు. తరువాత ఇక్కడ చాలా రోడ్లు కూడా వేసారు. దాదాపుగా 320 కిమీ రోడ్లు వేసారు. అలాగే భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కూడా కేటాయించారు. అంటే ఒకరి భూమిలో, మరొకరికి ప్లాట్ వచ్చి ఉంటుంది. ఇలా మొత్తం, రైతులకు ఇచ్చిన భూములు అన్నీ, ఇప్పటికే కొంత మేర నిర్మాణాలతో కళకళ లాడుతున్నాయి.
అయితే తాజాగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయం అనంతరం తాజాగా, ఈ ప్రత్యేక వ్యవసాయ మండలి ప్రతిపాదన రావడం సంచలనమే. 3 రాజధానుల ప్రతిపాదనపై ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు భగ్గుమంటున్న క్రమంలో వచ్చిన ఎస్ఎసిడ్ సిఫార్సుతో జగన్ ప్రభుత్వం ఒడ్డున పడుతుందా? ఈ ప్రాంతంలో వ్యవసాయ జోన్ ఏర్పాటు చేయటాన్ని ప్రతిపక్షాలు, ముఖ్యంగా రైతులు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడాలి. అయితే రైతులు మాత్రం, ఈ ప్రతిపాదనను తోసి పుచ్చుతున్నారు. ఇప్పటికే ఇక్కడ నిర్మాణాలు జరిగి, రోడ్లు వేసి, ప్లాట్లు వేసి ఉన్న చోట, వ్యవసాయం ఎలా చేసుకుంటామని, ఈ భూములు వ్యవసాయానికి, పనికి రావని వాపోతున్నారు.