జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే, జూన్ నెలలో జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో, జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయి. అసెంబ్లీ మొదటి సమావేశంలో, జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, మేము మాత్రం ఇలాంటి పనులు చెయ్యమని, మాది ప్రజా ప్రభుత్వం అని, ఎవరైనా మా పార్టీలోకి రావాలి అనుకుంటే, ముందుగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి కాని, మా పార్టీలోకి రావటానికి వీలు లేదని, నా మాటంటే మాటే అంటూ, జగన్ చెప్పుకొచ్చారు. దీనికి స్పందించిన స్పీకర్ తమ్మినేని కూడా, జగన్ మాటలకు వత్తాసు పలికారు. జగన్ గారు చెప్పింది నూటికి నూరు పాళ్ళు వస్తావం అని, ఇలాంటి అనైతిక పనులు మా దగ్గర కుదరవు అని, గతంలో స్పీకర్ కూడా దారుణంగా వ్యవహరించారని, ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యకుండా, పార్టీ మారితే, వారిని వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఇవన్నీ విన్న ప్రజలు వాస్తవం అని నమ్మారు.
అయితే ఇది చెప్పి ఆరు నెలలు అయ్యింది, అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తాను టిడిపి పార్టీలో కొనసాగలేక పోతున్నానాని, తనను ఇండిపెండెంట్ ఎమ్మేల్యేగా పరిగణించాలని కోరటం, దానికి స్పీకర్ కూడా ఒప్పుకోవటం ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం. అంతకు ముందు వంశీ జగన్ ను కలిసి, ప్రెస్ మీట్లు పెట్టి జగన్ ను పొగిడి, చంద్రబాబుని అమ్మనా బూతులు తిట్టిన సంగతి తెలిసిందే. అయితే దీని పై వివరణ ఇవ్వాలని, టిడిపి వంశీని సస్పెండ్ చేసి, షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయితే స్పీకర్ ఇలా చెయ్యటం పై, టిడిపి అభ్యంతరం చెప్పింది, తనని పార్టీ నుంచి బహిష్కరించలేదని, వంశీ క్రమశిక్షణ ఉల్లంఘించి నందుకు, తనని సస్పెండ్ చేసి, షోకాజ్ నోటీస్ మాత్రమే ఇచ్చామని అన్నారు.
ఇప్పుడు మళ్ళీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు వంతు. ఆయన కూడా జగన్ ని కలిసి, చంద్రబాబుని విమర్శించారు. ఆయన కూడా, ఇప్పుడు డైరెక్ట్ గా వైసీపీలో చేరకుండా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటూ స్పీకర్ ని కోరతారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పై, మాత్రం వైసీపీ వ్యూహం కనిపిస్తుంది. ఇసుక దీక్ష చేస్తున్న సమయంలో వంశీ చేత ప్రెస్ మీట్ పెట్టించి తిట్టించటం, తరువాత మళ్ళీ ఇప్పుడు అమరావతి పై ఆందోళనలు చేస్తున్న సమయంలో, అదే గుంటూరు నుంచి టిడిపి ఎమ్మేల్యేను లాగి, ఉద్యమానికి మద్దతు లేదు అని చెప్పాలి అనుకునే వైసీపీ వ్యూహం కనిపిస్తుంది. అయితే, ప్రజా ఉద్యమాలు ఇలాంటి రాజకీయం వలన దెబ్బ తింటాయా ? ఇలాంటి వ్యూహాలతో ప్రజలు మారతారా ? కడుపు మండిన అమరావతి రైతుకు మద్దాలి గిరి టిడిపిలో ఉంటే ఏంటి ? ఎక్కడ ఉంటే ఏంటి ? నాలుగు నెలలు ఇసుక లేక, పనులు లేక, ఇబ్బంది పడుతున్న కూలీలకు, వంశీ చంద్రబాబుని తిడితే ఏంటి ? జగన్ ను పొగిడితే ఏంటి ? ఇవేమీ రాజకీయ వ్యూహాలు ?