గన్నవరం ఎమ్మెల్యే వంశీ విషయంలో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు నడుస్తున్నాయి. వంశీ ఎటూ వెళ్తున్నారు, వంశీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయంలో, ఇటు వంశీ అభిమానుల్లో, ఇటు తెలుగుదేశం పార్టీలో, అటు వైసీపీలో కూడా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. మరో పక్క ఆటు వంశీని వదులుకోవటానికి సిద్దంగా లేమని తెలుగుదేశం పార్టీ అంటున్నా, వంశీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. చంద్రబాబుతో వాట్స్అప్ లేఖలు రాసిన వంశీ, చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే, కేశినేని నాని, కొనకళ్ళ నారాయణతో మాట్లాడండి అని చెప్పినా, వంశీ మాత్రం, అందుబాటులోకి రావటం లేదు. అయితే వంశీ నవంబర్ 3న వైసిపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వంశీ అనుచరులు, అన్ని గ్రామాల్లో తిరుగుతూ, వంశీకి మద్దతు కూడగట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఇప్పటికే వైసిపీలో ఉన్న గన్నవరం ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ పరిస్థితి ఘోరంగా ఉంది.
వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్రంగా వ్యక్తిరేకిస్తున్నారు. యార్లగడ్డ అనుచరులు కూడా వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యార్లగడ్డ ఇంటికి దాదపుగా 4 వేల మంది పైగా కార్యకర్తలు వచ్చి, వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. మొన్నటి దాక వంశీ మా పై కేసులు పెట్టారని, ఇప్పుడు అదే వంశీని పార్టీలో చేర్చుకోవటం ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. అయితే, యార్లగడ్డకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సిద్ధమని జగన్ ప్రకటించారని, ఇదే విషయాన్ని, జిల్లా ఇంఛార్జి మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా యార్లగడ్డకు తెలిపారని తెలుస్తుంది. అయితే రాజ్యం లేని రాజు పదవి తనకు ఎందుకుని, వంశీకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సహించేది లేదని, తానె ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని యార్లగడ్డ అంటున్నారు.
అయితే జగన్ మోహన్ రెడ్డి, సోమవారం యార్లగడ్డను వచ్చి కలవమని చెప్పారు. అయితే జగన్ ను కలిసే అవకాశం మాత్రం ఆయనకు కుదరలేదు. దీంతో సోమవారం జగన్ నివాసానికి వెళ్ళిన యార్లగడ్డ నిరాశతో తిరిగి వచ్చారు. మంగళవారం, బుధవారం అయినా తనని పిలుస్తారని అనుకున్నా, ఇప్పటి వరకు యార్లగడ్డకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తన అభిప్రాయం వైఎస్ జగన్కు తెలియచేసేందుకు, ఎంత ప్రయత్నం చేసినా కుదరటం లేదని, యార్లగడ్డ వాపోతున్నారు. వంశీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండటంతో, తాను ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి, మూడు రోజులుగా జగన్ అపాయింట్మెంట్ లేక, యార్లగడ్డ ఉసూరుమంటున్నారు.