ఈ రోజుల్లో, చిన్న చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా అధికార దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. తమకు ఉన్న వెసులబాటుతో, ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతూ ఉంటారు. అందులోనూ మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసి కూడా, ఎలా ఖర్చులు పెడుతున్నారో చూస్తున్నాం. కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు, మాటలు వరుకే కాని, చేతల్లో మాత్రం ఏమి జరగటం లేదు. ప్రమాణస్వీకారానికి తక్కువ ఖర్చు అయ్యిందని మొదట్లో చెప్పి, పగలు పూట జరిగిన ప్రమాణస్వీకారానికి, లైటింగ్ ఖర్చులు అంటూ, జీవో విడుదల చేసి డబ్బులు ఖర్చు పెట్టారు. అలాగే తన జీతం కేవలం నెలకు ఒక్క రూపాయి అని చెప్తూ, తన అనునాయులకు మాత్రం, విచ్చలవిడిగా జీతాలు, అలవన్స్ లు ఇస్తున్నారు. దాదపుగా 6-7 మంది విప్ లకు, నెలకు లక్ష రూపాయల అద్దె ఇస్తున్నారు. అలాగే తన సాక్షి ఆఫీస్ లో పని చేసిన వారిని ప్రభుత్వంలో సలహాదారులుగా పెట్టుకుంటూ, దాదాపుగా అన్ని ఖర్చులు కలిపి, నెలకు 4 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
ప్రభుత్వంలో, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇలా ఖర్చులు పెడుతుంటే, మన రాష్ట్ర గవర్నర్ మాత్రం, అదిరిపోయే డెసిషన్ తీసుకున్నారు. మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపించారు. గవర్నర్ అంటే రాష్ట్రానికి ప్రధమ పౌరుడు. ఆయనకు ఎన్ని హంగులు, ఆర్భాటాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. కాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం, అలనాటి ఆర్భాటాలకు దూరంగా, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా, అందరికీ ఆదర్శంగా నిలుస్తూ తీసుకున్న నిర్ణయంతో, ప్రజలు కూడా శభాస్ అంటున్నారు. ఆయన్ను చూసి, మన నాయకులు కూడా నేర్చుకోవాలని, ప్రతి చిన్న దానికి, హెలికాప్టర్, ప్రత్యెక విమానాలు పక్కన పెట్టి, రాష్ట్ర ఖజానాకు మరింత గండి పడకుండా కాపాడాలని అంటున్నారు.
విషయానికి వస్తే, తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అయితే, అధికారులు, ప్రబుత్వం, ప్రత్యెక ఫ్లిట్ ఏర్పాటు చేస్తూ ఉండగా, తనకు ఆ ఏర్పాట్లు వద్దని, అందరి లాగే, అందరితో పాటే, సామాన్య ఫ్లైట్ లోనే వెళ్తానని అన్నారు. అయితే విజయవాడ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ లేదని అధికారులు చెప్పటంతో, మరేం పర్వాలేదు, హైదరాబాద్ వెళ్లి, అక్కడ నుంచి వెళ్దాం అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి తిరుపతికి సామాన్య ఫ్లైట్ లోనే వెళ్లారు. అయితే, కొండ పై కూడా, తాను ఎక్కువ సేపు ఉంటే, ఇబ్బంది అవుతుందని గ్రహించి, దర్శనం చేసుకుని, వెంటనే గంటలోపే, కిందకు వెళ్ళిపోయారు. మళ్ళీ అదే సామాన్య పౌరులు వెళ్ళే ఫ్లైట్ లోనే హైదరబాద్ వెళ్లి, అక్కడ నుంచి విజయవాడ రానున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గమనించి, గవర్నర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం.