రాష్ట్రంలో రాజకీయం వేగంగా మారిపోతుంది. మొన్నటి దాక బీజేపీ, వైసీపీ భాయ్ భాయ్ అంటూ కలిసి తిరిగాయి. కలిసి పని చేసాయి. కలిసి చంద్రబాబుని దింపి, జగన్ మోహన్ రెడ్డిని ఎక్కించారు. ఇక విజయసాయి రెడ్డి గారు అయితే, ఢిల్లీలో చెయ్యని లాబాయింగ్ లేదు. ఎన్నికల ముందు వరకు, ఆయన ప్రతి రోజు ప్రధాని కార్యాలయంలో ఉంటున్నారు అంటూ వార్తల్లో వచ్చిన కధనాలు చూసాం. విజయసాయి రెడ్డి, మోడీ, అమిత్ షాలకు బాగా క్లోజ్ అయిపోయారు. జగన్ మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా, ఎన్నికల్లో సహకారం ఇచ్చారు. అయితే ఎన్నికలు అయిన తరువాత, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ప్రధాని మోడీ కూడా, హలో విజయ్ గారు అనేంత సన్నిహితం చూసాం. అయితే గత నెలా రెండు నెలలుగా, వాతావరణం మారిపోతూ వస్తుంది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, పోలవరం విషయంలో కేంద్రం, జగన్ ప్రభుత్వం పై,
తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలో, విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విషయంలో మాకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయంటూ, వీళ్ళ తప్పులని, వాళ్ళ పై తోసేసే ప్రయత్నం చేసారు. అయితే, దీని పై కేంద్రం సీరియస్ అయ్యి, విజయసాయి రెడ్డిని పిలిచి చీవాట్లు పెట్టారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలోనే బీజేపీ నేతలు, విజయసాయి రెడ్డి పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి, సంచలనం రేపారు. విజయసాయిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జీవో జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డిని, ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతిని కోరారు బీజేపీ నేతలు.
జయాబచ్చన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రామకోటయ్య రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఆ పదవి లాభదాయక పదవుల కిందకు వస్తుందని భయపడి జీవోను రద్దు చేశారని అన్నారు. ఈసీ కూడా వెంటనే స్పందించాలని కోరారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపైనా రామకోటయ్య తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ వంద రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేసిన ఘనత జగన్‌కే సొంతమవుతుందన్నారు. రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు 151 సీట్లను ఇస్తే.. ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక విధానంతో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వైసీపీ వంద రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.