ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్నికల్లో ఓటమి తరువాత, మొదటి సారి, జిల్లాల పర్యటనకు వెళ్లారు. ముందుగా, తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఎన్నికల ఓటమి పై సమీక్షలు శ్రేణుల్లో ధైర్యం నింపారు. చాలా రోజుల తరువాత, తమ అధినేత, తమతో ఎక్కువ సేపు గడపటంతో కార్యకర్తలు కూడా సంతోష పడ్డారు. ఓటమికి గల కారణాలు, పార్టీలోని ఇబ్బందులు, ఇలా అనేక విషయాల పై చర్చించారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల నేతలతో రెండు రోజులు పాటు చంద్రబాబు అన్ని విషయాలు చర్చించారు. నేతలు , కార్యకర్తలు కూడా చంద్రబాబు ముందు అన్ని విషయాలు కుండబద్దలు కొట్టారు. పార్టీ తప్పులతో పాటు, ఏంచేస్తే తిరిగి పార్టీకి పునరుత్తేజం కలుగుతుందో ఏకరువు పెట్టారు.
ఈ సమీక్షలో కొంత మంది నేతలు డుమ్మా కొట్టారు, తోటత్రిమూర్తులు లాంటి నేతలు కూడా డుమ్మా కొట్టారు. దీంతో అలాంటి నేతలను ఇంకా బుజ్జగించటం అనవసరం అని, ఈయన స్థానంలో కొత్త నేత ఎంపికకు చంద్రబాబు ఓకే చెప్పారు. జిల్లాలో జరుగుతోన్న పరిణామాల పై సీనియర్ నేతలతో వన్ టు వన్ రహస్య సమావేశమై చంద్రబాబు చర్చించారు. ఎన్నికల తర్వాత వచ్చిన చంద్రబాబు పార్టీ నాయకులు, క్యాడర్‌లో ఉత్తేజం నింపారు. ప్రభుత్వం కావాలని అక్రమ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందిపడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదే సమయంలో గడచిన అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉండి, కార్యకర్తల దూరంగా, వారి అభిప్రాయాలు వినిపించే అవకాసం లేదని అభిప్రాయానికి ఆయన కూడా అంగీకరించారు.
ఈ రెండు రోజులు ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. సాధ్యమైనంత వరకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అటు కార్యకర్తలు, ఇటు నాయకులు కూడా ఇన్నాళ్లకు తమ అధినేతతో సమయం దొరికింది అని, అభిప్రాయాలను పంచుకున్నామని, మనసు విప్పి అన్ని కష్టాలు అధినేతతో పంచుకున్నామని, చంద్రబాబు స్పందించిన తీరుతో సంతోషంగా ఉన్నామని అన్నారు. తమకు అధికారం లేకున్నా పార్టీని దర్జాగా నడిపిస్తామని భరోసా ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో సమీక్ష చేసిన చంద్రబాబు వెళ్తూవెళ్తూ మనసులో మాట బయటపెట్టారు. రెండు రోజుల్లో కార్యకర్తలతో భేటీ తర్వాత తానేం కోల్పోయానో అర్థమైందని బహిరంగంగా పేర్కొన్నారు. తూర్పుగోదావరి నుంచి సంతోషంగా వెళ్తున్నట్టు వెల్లడించారు. సీఎంగా తీరిక లేకపోవడంతో జిల్లాలో పార్టీకి, క్యాడర్‌కు చెయ్యాల్సిన పనులు చేయలేదని తనకు అర్థం అయ్యిందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అధినేతలో వచ్చిన మార్పు చూసి కార్యకర్తలు సంతోష పడ్డారు.