ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరాన్ని ప్రశ్నార్థకం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. గద్దెనెక్కిన కొద్ది రోజుల్లోనే రివర్స్ టెండరింగ్ అంటూ నవయుగని తరిమేసి తన బినామీ అయిన మేఘా సంస్థని దింపారు. అప్పటి నుంచి పోలవరంలో ప్రగతి ఒక అడుగు ముందుకు మూడడుగుల వెనక్కి చందంగా ఉంది. టిడిపి హయాంలో 70 శాతం పూర్తయిన పోలవరం నాలుగేళ్ల వైసీపీ పాలనలో 7 శాతం కూడా పూర్తి కాలేదు. పోలవరం 2020లోనే పూర్తి చేస్తామని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం..ఇప్పుడు 2025 అంటోంది. అది కూడా ప్రశ్నార్థకమే. ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం కమీషన్ల వరంగా పొందిన మేఘా, కొత్త స్కెచ్ వేస్తోంది. విశాఖలో సీఎం రుషికొండని కొట్టేస్తే, తామేమి తక్కువ తిన్నామంటూ పోలవరం పక్క కొండపై మేఘా కన్నేసింది. దీనికి ఓ అందమైన ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది. పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఫైవ్ స్టార్ హోటల్ కట్టేందుకు తమకి ఆ కొండ ఇచ్చేయాలని మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి సీఎం జగన్ రెడ్డికి ప్రతిపాదించారు. ప్రభుత్వం తమకు స్థలం కేటాయిస్తే ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రిని కోరారు. ఎప్పటి నుంచో తాము కొండపై స్థలం కోరుతున్నామని మేఘా కృష్ణారెడ్డి అన్నారంటే, పోలవరం కంటే ముందు ఈ కొండని కొట్టేసేందుకు ప్లాన్ చేశారనేది స్పష్టం అవుతోంది. అయితే మేఘా అడిగితే వేలకోట్ల పోలవరం ప్రాజెక్టునే ధారాదత్తం చేసిన సీఎం ఈ కొండని ఇవ్వకుండా ఊరుకుంటాడా అనే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మేఘా కృష్ణారెడ్డి అడిగిన కొండ ఇచ్చేందుకు ఏర్పాట్లు చూడాలని అధికారులని సీఎం ఆదేశించినట్టు సమాచారం.
news
ముందస్తుకి వెళ్లేందుకు భయపడుతోన్న జగన్
ఏపీలో ముందస్తు ఎన్నికలకే ముఖ్యమంత్రి మొగ్గుచూపుతున్నారని అనుకూల, ప్రతికూల మీడియా కోడై కూస్తోంది. సీఎం నిర్ణయాలు కూడా ఆ దిశగానే తీసుకోవడం చర్చలు ముందస్తు చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రాంతాలకు అతీతంగా, కులమతాల ప్రస్తావన లేకుండా ప్రజలు ప్రభుత్వంపై పీకల్లోతు కోపంతో ఉన్నారు. ఏ తాయిలాలు పనిచేసేలా లేవు. ముందస్తు వచ్చినా, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా వైసీపీ దారుణ పరాజయం ఖాయమని ఆ పార్టీలో సీనియర్లకి తెలిసిన బహిరంగ రహస్యం. ప్రజావ్యతిరేకత తీవ్రతకి సంకేతంగా పోల్ మేనేజ్మెంట్, డబ్బు పంపిణీ, దొంగ ఓటర్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లో వైసీపీని కాపాడలేకపోయాయి. ఈ స్థాయి జనాగ్రహంలో ఇప్పుడు ఎన్నికలకి వెళ్లినా, షెడ్యూల్ ప్రకారం వెళ్లినా ఓటమి తప్పనప్పుడు ముందుగా ఎందుకు అధికారాన్ని వదులుకోవాలనే ఆలోచన వైసీపీ పెద్దల్లో మొదలైంది. సాధ్యమైనంత వరకూ అధికారం అనుభవించి, అనుయాయులకి మేలు చేకూర్చే అవకాశం వదులుకోవడం ఎందుకు అనే ప్రతిపాదనకే అందరూ ఓకే అనడంతో ఇక ముందస్తుకి వెళ్లే ఆలోచనని విరమించుకున్నారని సమాచారం. దీనిని ధ్రువీకరిస్తూ ఇటీవలే కేబినెట్‌లో పవర్ ఫుల్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని పెద్దిరెడ్డి చెప్పడంతో ముందస్తుకి వెళ్లే విషయంలో జగన్ రెడ్డి వెనకడుగు వేశారని తేలిపోయింది.
ఊరూరా ఫ్లెక్సీ వార్ కి తెరలేపిన వైసీపీ
వైసీపీ శైలి ప్రమాదకర ఎత్తుగడలకి తెరతీసింది. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాలని సైతం అల్లకల్లోలం చేసే వ్యూహం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకి దారి తీస్తోంది. రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమ కార్యక్రమాలు చేసుకోవడం ఆనవాయితీ. ప్రభుత్వం తాము చేసింది ప్రచారం చేసుకుంటుంది. ప్రతిపక్షం సర్కారు వైఫల్యాలను ఎండగడుతుంది. ఇవి వివిధమార్గాల ద్వారా చేస్తారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజాస్వామ్యంలోనే చాలా డేంజర్ పోకడని మొదలుపెట్టింది. ప్రజాధనంతో ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి అందులో విపక్షాలపై ఆరోపణలు గుప్పించడంతో వార్‌కి తెరతీసింది. టిడిపి బీసీ సదస్సు పెడితే, అంతకు ముందే బీసీలకి టిడిపి అన్యాయం చేసిందని వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలు కట్టడం వైసీపీ నయా కన్నింగ్ పాలిటిక్స్. మహానాడు కోసం టిడిపి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకుంటే..పసుపు జెండాలు ఫ్లెక్సీల మద్యలో వైసీపీ ఫ్లెక్సీలు వేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఏ ఊరు వెళితే ఆ ఊరిలో పేదల కోసం జగన్ రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడంటూ రాముడి పోజులో జగన్ రెడ్డిని పెట్టి భారీ ఫ్లెక్సీలు కడుతున్నారు. చంద్రబాబు నుంచి నియోజకవర్గ ఇన్చార్జి పర్యటించినా అక్కడ ఈ ఫ్లెక్సీలతో వైసీపీ కవ్విస్తోంది. టిడిపి కూడా ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రజాధనం దోపిడీ చేసిన దొంగపై చంద్రన్న యుద్ధం, పేదలపై పెత్తందారుడైన జగన్ చేస్తున్న దౌర్జన్యాలని అడ్డుకుంటామంటూ టిడిపి ఫ్లెక్సీలు వేస్తోంది. వైసీపీ ఫ్లెక్సీల జోలికెళ్లని పోలీసులు, టిడిపివి మాత్రం పీకేస్తున్నారు. దీంతో రాష్ట్రమంతా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. వైసీపీ కవ్వింపు చర్యలు, పోలీసుల పక్షపాత వైఖరితో ఫ్లెక్సీ వార్ తీవ్రం అవుతోంది.
వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుకి సుప్రీంలో సునీతారెడ్డి పిటిషన్
పట్టు విడవకుండా పోరాడేవారిని పట్టువదలని విక్రమార్కుడు అంటారు. న్యాయం కోసం, తన తండ్రి హంతకులని చట్టం ముందుకు నిలబెట్టడానికి ఒక్క మహిళ పట్టువదలని విక్రమార్కురాలిలా పోరాడుతోంది సునీతారెడ్డి. అన్నలే గన్‌లు ఎక్కుపెట్టి బెదిరిస్తున్నా, కాపాడాల్సిన వారే కాటేయజూస్తున్నా వెనక్కి తగ్గని ధీర వనిత వైఎస్ సునీతారెడ్డి మరో సంచలన పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి సీబీఐ దాకా నిందితుల్ని కాపాడుకుంటూ, అరెస్టు కాకుండా మేనేజ్ చేస్తూ వస్తున్న అన్నపై న్యాయపోరాటానికి అత్యున్నత న్యాయస్థానం తలుపు మరోసారి తట్టింది. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీతారెడ్డి పిటిషన్ వేసింది. మే 31న అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు లో సవాల్ చేసింది. తన తండ్రి హత్య కేసులో అవినాశ్ రెడ్డిపై మోపినవి కీలక అభియోగాలని, హైకోర్టు తీర్పులో లోపలున్నాయన్న సునీతారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ అభియోగాలు హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని కోర్టుకి విన్నవించింది. రేపు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. సుప్రీంకోర్టుకి సునీతారెడ్డి చేరడంతో మళ్లీ లాబీయిస్టు విజయకుమార్ దగ్గరకి వైఎస్ జగన్ రెడ్డి టీము భేటీ అయ్యే అవకాశాలున్నాయి.