వైసీపీ ఎమ్మల్యే మల్లాది విష్ణు గెలిచారంటూ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దుచేయాలంటూ, హైకోర్టును పిటీషన్ నమోదు అయ్యింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 11 పోలింగ్ స్టేషన్ లలోని వీవీప్యాట్లమీ లెక్కించాకే తుది ఫలితాల్ని ప్రకటించాలని ఎంత కోరినా, అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని చెప్తూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పై తీవ్ర అభ్యంతరం ప్రకటిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన పై, 25 ఓట్లతో వైసీపీ ఎమ్మల్యే అభ్యర్థి మల్లాది విష్ణు గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి ఫలితాల రోజైన మే 23న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని బొండా ఉమా కోరారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా చాలా తేడాలు మేము గమనించానన్నారు. ఈ మొత్తం వ్యవహారం పై అదే రోజు కృష్ణా జిల్లా ఎన్నికల అధికారికి వినతి సమర్పిస్తూ ఎన్నికల ఫలితాల ప్రకటన చేసే ముందే వీవీప్యాట్ల లెక్కింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంత కోరినా, ఎవరూ పట్టించుకోలేదని బొండా ఉమా అన్నారు. ఈ అంశాలు అన్నీ పరిగణనలోకి తీసుకొని తాను ఇచ్చిన పిటీషన్ పై ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలు మేరకు వ్యవహరించేలా ఎన్నికల అధికారిని ఆదేశించాలని బొండా ఉమా , హైకోర్ట్ ని కోరారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు, పిటీషన్ కాపీలను ఎలక్షన్ కమిషన్ తరఫున ఉన్న న్యాయవాదికి ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి హైకోర్ట్ వాయిదా వేసింది.