తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 21న ప్రాజెక్టుకును ప్రారంభించేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర వెళ్లి సీఎం ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. అలాగే ఏపీలో కూడా వైఎస్ జగన్‌ను కూడా, ఈ రోజు విజయవాడ వచ్చి ఆహ్వానించబోతున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ వద్దు అంటూ ప్రతిపక్ష నేతగా జగన్ ఆందోళన చేసి, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు జగన్, ఏ మొఖం పెట్టుకుని, ఏపి రాష్ట్రానికి అన్యాయం చేసే ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు అంటూ, ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావడంపై భిన్న వాదనలు వినపడుతున్నాయి.
అంతే కాదు, జగన్ కాళేశ్వరంకు రావడం పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వై.ఎస్.జగన్‌కు, తెలంగాణ తాజా మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం లేఖ రాశారు. అప్పట్లో తెలంగాణను సస్యశ్యామలం చేసి, నీరు ఇచ్చే ఉద్దేశంతో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మొదలు పెట్టారని, ఇప్పుడు కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ పక్కనపెట్టి, దానికి పేరు మార్చి, డిజైన్ మార్చి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టిందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందిని, ఇలాంటి ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తే రాజశేఖర్‌రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని, కేసీఆర్ చేస్తున్న అవినీతిని సమర్థించినట్లు అవుతుంది భట్టి అని లేఖలో పేర్కొన్నారు.