సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక ఉన్నది బర్తరఫ్ అయిన కొందరు మాజీ ఉద్యోగులా? అవుననే అంటున్నారు... ‘మహా కుట్ర’ జరిగిందని సీనియర్ న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్! సుప్రీం ధర్మాసనం ఆదేశాల మేరకు ఆయన తన వద్ద ఉన్న, ‘కుట్ర’ కు సంబంధించిన సాక్ష్యాధారాలను బుధవారం సీల్డు కవరులో సమర్పించారు. అందులో సీసీటీవీ ఫుటేజి ఉన్న డిస్క్‌లు, కొన్ని పత్రాలు ఉన్నట్లు ఆయనే వెల్లడించారు. వీటి ప్రకారం.. ఈ మధ్యే అనిల్ అంబానీ-స్వీడిష్ కంపెనీ ఎరిక్సన్ మధ్య సెటిల్మెంట్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను, తీర్పును మార్చేసి అప్‌లోడ్ చేసిన మానవ్ శర్మ, తపన్ కుమార్ చక్రవర్తి అనే ఇద్దరు ఉద్యోగులను జస్టిస్ గొగోయ్ డిస్మిస్ చేశారు.
అనిల్ అంబానీకి వ్యక్తిగత మినహాయింపునిచ్చే అంశంపై ఇచ్చి న రూలింగ్‌ను వారు మార్చేసిన ట్లు తేలడంతో వేటు వేశారు. ఈ ఇద్దరితో పాటు మరో మాజీ ఉద్యోగి, కొందరు కార్పొరేట్ లాబీయిస్టులు, ఫిక్సర్లు కుమ్మక్కై ఆయనపై కుట్ర పన్నారని బెయిన్స్ పేర్కొన్నట్లు సమాచారం. లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తే గొగోయ్‌పై ఒత్తిడి పెరిగి రాజీనామా చేస్తారని, అందుకే ఈ పనికి వారు ఒడిగట్టారని బెయిన్స్ తన అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘‘మీరు చేసిన ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. వీటిని రుజువుపర్చలేకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా మీకు తెలుసు’’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనను హెచ్చరించింది. తన వద్ద ‘‘తిరుగులేని ఆధారాలు’’ మరిన్ని ఉన్నాయని ఉత్సవ్ బెయిన్స్ చెప్పడంతో గురువారం ఉదయం వాటిని సమర్పించాలని బెంచ్ కోరింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం వేసి కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరినా బెంచ్ తిరస్కరించింది.
ఈ కేసుకు సంబంధించి బుధవారం నాటకీ య పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. ఉదయం పదిన్నర గంటలకే జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలో జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉత్సవ్ బెయిన్స్ సాక్ష్యాధారాలను పరిశీలించింది. వెంటనే అత్యవసర సమావేశానికి రావాల్సిందిగా సీబీఐ డైరెక్టర్, ఢిల్లీ పోలీసు కమిషనర్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌లను ఆదేశించింది. వారితో జడ్జీలు తమ చాంబర్‌లో సమావేశమయ్యారు. చీఫ్ జస్టిస్ గొగోయ్‌ను అప్రతిష్ట పాల్జేయడం ద్వారా న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు మహాకుట్ర జరుగుతోందోన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకతను వారు చర్చించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఉత్సవ్ బెయిన్స్ సమర్పించిన ఆధారాలకు సంబంఽధించిన అన్ని పత్రాలనూ, ఉపకరణాలనూ, మెటీరియల్‌నూ స్వాధీనపర్చుకోవాల్సిందిగా బెంచ్ ఆదేశించింది.