బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా సముంద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. సముంద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటాయి. రాష్ట్రంలో జాలర్లు ఎవ్వరూ కూడా ఈ నెల 27వ తేదీ నుంచి సముంద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని రియల్ టైమ్ గవర్నెన్స్‌కు చెందిన అవేర్ (ఆంధ్రప్రదేశ్ వెథర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చి సెంటర్) సూచిస్తోంది. ఇప్పటికే జాలర్లు ఎవరైనా సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఉంటే వారంతా వెంటనే 28వ తేదీలోపు తీరానికి తిరిగి వచ్చేయాలని సూచించడమైనది. ప్రజలు కూడా ఎవరూ తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. సముద్ర స్నానాలు చేయడం, తీర ప్రాంతానికి వెళ్లి సముద్రపు అలలతో ఆడుకోవడం లాంటివి చేయరాదని తెలియజేయడమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పయనిస్తున్న దిశను రియల్ టైమ్ గవర్నెన్స్ నిశితంగా గమనిస్తోంది.
హిందూ మహాసముద్రం-ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ ఉదయం వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. ట్రింకోమలి(శ్రీలంక)కు తూర్పు ఆగ్నేయదిశగా 1,140 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకు ఆగ్నేయంగా 1,490 కి.మీ, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయదిశగా 1,760 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కదులుతోంది. మరో 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా.. ఆ తర్వాత 12 గంటల్లో తుపానుగా మారే అవకాశముంది.
తుపాను ఈనెల 30న శ్రీలంక తీరాన్ని తాకి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో 29న తమిళనాడు తీరం, పుదుచ్చేరి వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈనెల 29, 30 తేదీల్లో కేరళ, దక్షిణాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయి. ఈ తుపానుకు బంగ్లాదేశ్ నామకరణం చేసిన ‘ఫణి’ పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.