ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23వ తేదీన పెట్రో ధరలు అమాంతం ప్రజలపై రుద్దడం ఖాయమని, అప్పటి వరకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచొద్దని ఆయిల్ కంపెనీలను ప్రధాని మోదీ ఆదేశించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మే 23న దేశవ్యాప్తంగా లోక్‌సభ, కొన్ని రాష్ట్రల్లో అసెంబ్లీ, ఉపఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపేయకుంటే ఆంక్షలు విధిస్తామంటూ భారత్ సహా పలు దేశాలను అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23వరకూ ఓపిక పట్టాలని ఆయిల్ కంపెనీలను మోదీ కోరినట్టు కాంగ్రెస్ పేర్కొంది.
'తన సాహసాలను ప్రతిరోజూ కథలు కథలుగా చెప్పుకునే మోదీజీ ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సొంతం చేసుకునేందుకే ఆయన పెట్రో ఆంక్షలు, ధరలపై నోరు మెదపడం లేదు. మే 23 వరకూ ధరలు పెంచొద్దంటూ ఆయన ఆయిల్ కంపెనీలను ఆదేశించారు' అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 'మే 23వ తేదీ సాయంత్రంకల్లా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 నుంచి రూ.10 వరకూ పెంచడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయం మాత్రం దేశ ప్రజలకు చెప్పకుండా దాచిపెడుతున్నారు' అని సూర్జేవాలా హిందీ ట్వీట్‌లో తెలిపారు. దేశ చమురు అవసరాలు, భద్రతపై ప్రధాని మోదీ మౌన ప్రేక్షకుడిలా ఎందుకు ఉండిపోతున్నారని ఆయన ప్రశ్నించారు.
అయితే ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణగా కొట్టి పారేయటానికి వీలు లేదు. అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలు ముందు ముందు భారత దేశ ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం చూపొచ్చు. ఇప్పటిదాకా అమెరికా భారత్ విషయంలో ఇరాన్ నుండి చమురు కొనుగోళ్ళపై రాయితీలను ఇచ్చింది. 6 నెలల పాటు ఇచ్చిన రాయితీలు ఈ మే నెల మొదటి వారంలో ముగుస్తాయి. తాజాగా ట్రంప్ ఇరాన్ నుండి చమురు కొనుగోళ్ల విషయంలో మరింత కఠినంగా ఉంటామని , భారత్, చైనాలకు ఇచ్చే సబ్సీడీలను ఇక ముందు ఇవ్వబోమని తేల్చి చెప్పడంతో భారత్ ఇరుకున పడినట్టైంది. ఒక వేళ భారత్ మే నెల నుండి ఇరాన్ నుండి చమురు దిగుమతి చేసుకుంటే ..అమెరికా ఆగ్రహానికి గురికావాల్సి రావొచ్చు. ఇప్పటిదాకా అమెరికా నుండి ఎగుమతులు, దిగుమతుల విషయంలో ప్రత్యేక రాయితీలను పొందిన భారత్ వాటిని కోల్పోవాల్సి రావొచ్చు. ఇది భారతీయ మార్కెట్లపై, ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్‌పై విధించిన ఆంక్షల మూలంగా ఇప్పటికే అంతర్జాతీయంగా చమురు బ్యారెళ్ళ ధరలు పెరిగిపోయాయి.