రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు మహారాణులయ్యారు. 101 నియోజకవర్గాల్లో పురుషులకంటే మహిళలు 2 లక్షల 40 వేల మంది అదనంగా ఓట్లేశారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కలు చూస్తే.. రాష్ట్రంలో మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. వీరి తీర్పు ఎవరిని అధికార పీఠం వద్దకు తీసుకెళ్తుందనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఆధ్యంతం ఆసక్తికరంగా జరిగాయి. చివరి నిమిషంలో అధికారుల బదిలీ, ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఎండవేడిమి, ఉదయం ఓటేయ్యలేనివారు తిరిగి సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం, తెల్లవారుఝాము వరకు పోలింగ్ జరగడం వంటి ఆసక్తికరమైన సంఘటనలెన్నో జరిగాయి. కానీ ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా మహిళలు పట్టుదలతో వచ్చి ఓట్లు వేశారు.
రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో 3 కోట్ల 13 లక్షల 33 వేల 631 మంది అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని 79.64 శాతం ఓట్లేశారు. ఇందులో పురుషులు కోటి 55 లక్షల 45 వేల 211 మంది కాగా, స్త్రీలు కోటి 57 లక్షల 87 వేల 759 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో 2 కోట్ల 87 లక్షల 91 వేల 613 మంది ఓట్లు పోల్ అవ్వగా, అప్పట్లో 78.41 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పురుషులు కోటి 43 లక్షల 78 వేల 804 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, కోటి 44 లక్షల 12 వేల 652 మంది మహిళలు ఓట్లు వేశారు. 2014 ఎన్నికలకు, నేటికీ మహిళలు అదనంగా 2 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం స్పష్టమవుతోంది.
ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో 101 నియోజకవర్గాల్లో పురుషులకంటే మహిళలు అదనంగా ఓటు హక్కును వినియోగించుకున్నారనేది స్పష్టం అవుతోంది. వెయ్యికిపైగా పురుషులకంటే అదనంగా మహిళలు ఓట్లేసిన నియోజకవర్గాలు రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నాయి. ఇందులో శ్రీకాకుళంలో 8, విజయగనగరంలో 7, విశాఖపట్నంలో 11, తూర్పు గోదావరిలో 6, పశ్చిమగోదావరిలో 8, కృష్ణాలో 9, గుంటూరులో 15, ప్రకాశంలో 6, నెల్లూరులో 8, కడపలో 9, కర్నూల్ లో 5, అనంతపురంలో 1, చిత్తూరులో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషులకంటే అదనంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుసుపు-కుంకుమ పథకంతో డ్వాక్రా మహిళలు, అన్నదాత సుఖీభవ, రుణమాఫీతో రైతులు, పెన్షన్లతో వృద్ధులు, వికలాంగులు, వితంతవులు తమ ఓటు హక్కును తెలుగుదేశానికి అనుకూలంగా వినియోగించుకున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే తమకు 130 వరకు సీట్లొస్తాయని దేశం వర్గాలు విశ్లేషిస్తున్నాయి.