ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, సీఎం చంద్రబాబు చేసిన సమీక్షల పై వైసీపీ కంప్లైంట్ ఇవ్వటం, దాని పై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవ్వటం చక చకా జరిగిపోయాయి. కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలో అధికారులు పాల్గొనడం పై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. కోడ్ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాల్సిందేనని చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తూ సీఈవో ఉత్తర్వులు పంపింది. దీనిపై చీఫ్ సెక్రటరీ చర్యల్లో భాగంగా సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులకు నోటీసులు పంపించారు. ముఖ్యంగా సీఆర్డీఏ, జలవనరుల శాఖ అధికారుల నుంచి వివరణ కోరుతూ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. ఓవైపు ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, ముఖ్యమంత్రి చేపట్టే సమీక్షల్లో పాల్గొనడంపై సంజాయిషీ కోరారు.
ముఖ్యంగా సీఆర్డీఏ, జల వనరుల శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం కోరినట్టు తెలుస్తోంది. అటు, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సీఎం సమీక్షలపై వైసీపీ నేతల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై నివేదిక ఇవ్వాలంటూ సీఎస్ ను ఆదేశించినట్టు సమాచారం. ఆయన తాగునీటి ఎద్దడి..పోలవరం పై ప్రజా వేదికలో సమీక్ష నిర్వహించారు. ఈ రెండు సమీక్షలకు సంబంధింత అధికారులు హాజరయ్యారు. పోలవరం సమీక్షకు మంత్రి దేవినేని ఉమాతో పాటుగా జలవనరుల శాఖ కార్యదర్శి శశి భూషన్ కుమార్ ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక, గురువారం సచివాలయం వచ్చిన ముఖ్యమంత్రి అమరావతి నిర్మాణం పై సీఆర్డిఏ అధికారులతో సమీక్షించారు.
ఆ సమీక్షలో మంత్రి నారాయణతో పాటుగా మున్సిపల్, సీఆర్డిఏ అధికారులు పాల్గొన్నారు. అప్పటికే ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘన పైన స్పందించటంతో ఆ తరువాత ముఖ్యమంత్రి ముందుగా నిర్ణయించుకున్న శాంతి భద్రతల సమీక్షను రద్దు చేసుకున్నారు. కేవలం హోం శాఖ కార్యదర్శి అనురాధ సీయంకు బ్రీఫింగ్ ఇచ్చారు. ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుల పై ప్రభుత్వ ప్రధాక కార్యదర్శి సైతం అధికారులకు మద్దతుగా కాకుండా..వారి నుండి వివరణ కోరటం పైనా అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ప్రభుత్వ వాదన మాత్రం మరో రకంగా ఉంది. చంద్రబాబు సియంగా గడువు జూన్ 8 దాక ఉందని, ఇప్పటికీ చంద్రబాబు ఫుల్ టైం సియం అని, ఆపద్ధర్మ సియం కాదని అంటున్నారు. 43 రోజులు ప్రజలను గాలికి వదిలేయ్యలా ? వేసవిలో నీటి ఎద్దడి ఎవరు పట్టించుకుంటారు ? వర్షాలు పడక ముందే, వేసవిలో పరుగులు పెట్టాల్సిన పోలవరం, అమరావతి గురించి ఎవరు పట్టించుకుంటారు అని ప్రభుత్వ వాదన... పాలసీ డెసిషన్స్ ఏమి తీసుకోకుండా, కేవలం జరుగుతున్న పనులు పై సమీక్షలు చేస్తున్న, ఈసీ ఎందుకు అభ్యంతరం తెలుపుతుందో అర్ధం కావటం లేదని అంటున్నారు.