‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంలు) వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది’. బీజేపీ ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహారావు గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయం. దీనిపై ఒక పుస్తకం కూడా ఆయన రాశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లకు ఈవీఎంలు చుక్కలు చూపించిన తరుణంలో జీవీఎల్ రాసిన పుస్తకంపై విస్తృత చర్చ జరుగుతోంది. 2009 ఎన్నికల తర్వాత దేశ, విదేశాల్లోని ఘటనలను ఉదహరిస్తూ ఆయన రాసిన 230 పేజీల పుస్తకం ‘డెమోక్రసీ ఎట్ రిస్క్ డ్యూ టూ ఈవీఎం్స’లో వీటి పనితీరును ఎండగట్టారు. అప్పటి బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీ ఆ పుస్తకానికి ముందుమాట రాయగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈవీఎం పద్ధతిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చంద్రబాబు అదే మాటపై ఉండగా బీజేపీ ఎంపీ జీవీఎల్ మాత్రం అదే ఈవీఎంలను నేడు సూపర్ అనడం విడ్డూరంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ఏకిపారేస్తున్నారు. ఒడిసా ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినా బీజేడీకి పోలయ్యాయని, పోలింగ్ ముగియగానే 52.6% అని పీవో ప్రకటిస్తే కౌంటింగ్ నాటికి అది 65.9శాతానికి చేరిందని తన పుస్తకంలో ప్రస్తావించారు.
‘ఈవీఎంల పనితీరును నిరసిస్తూ తమిళనాడులో జయలలిత ఐదు అసెంబ్లీ ఉప ఎన్నికలను బహిష్కరించారు. ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో ఒక పోలింగ్ బూత్‌లో 417 ఓట్లు పోలయితే 415 ఒక స్వతంత్ర అభ్యర్థికి వచ్చాయి. ఆ అభ్యర్థికి వచ్చిన మొత్తం ఓట్లు 998 మాత్రమే’ అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రెల్లివలస, పెదకూరపాడు నియోజకవర్గంలోని నాగిరెడ్డిపాలెం, ఉరవకొండ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్, తమిళనాడులోని తిరుచిరాపల్లి, మహారాష్ట్రలోని బండారా.. ఇలా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంల లోపాలపై పుస్తకంలో జీవీఎల్ ప్రస్తావించారు. వివిధ పార్టీల నాయకుల అభిప్రాయాలను జోడించారు. సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని గుర్తు చేశారు.
‘అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఈవీఎంలను తప్పుపట్టారు. అరబ్ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈవీఎంలలో లోపాలపై వివిధ పత్రికలు కోడై కూశాయి’ అని వాటి గురించి పుస్తకంలో వివరించారు. అయితే బీజేపీ విపక్షంలో ఉండగా ఒక రేంజ్లో ఈవీఎంలపై విరుచుకుపడిన జీవీఎల్ ఇప్పుడు సమర్థిస్తూ మాట్లాడటంపై ఆ పార్టీలోని నేతలే నోరెళ్లబెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అర్ధరాత్రి వరకూ నిల్చోబెట్టిన పాపం ఎవరిది? దేశచరిత్రలో తెల్లవారుజాము వరకూ ఓటింగ్ ఎక్కడైనా, ఎప్పుడైనా జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుపై కోపం ఉంటే ఆయన్ను విమర్శించుకోవచ్చునని, ప్రజలను పగలు ఎండలో, అర్ధరాత్రి చీకల్లో నిల్చోబెట్టిన ఈసీని, మొరాయించిన ఈవీఎంలను సమర్ధించడం ఏంటని మండిపడుతున్నారు.