వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేశ్ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు, టీడీపీ నేతలు తప్ప ప్రజలెవరు ఆరోపించడం లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇందుకు కౌంటర్‌గా ట్విట్టర్లో స్పందించారు ఏపీ మంత్రి నారా లోకేశ్. తనకు అనుకూలంగా జరిగితే అంతా సవ్యంగా జరిగిందని... లేదంటే అక్రమం అని వాదించేవాళ్లు స్వార్థపరులు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మీరు లోటస్ రక్షణలో ఉన్నారంటూ... పరోక్షంగా జగన్ బీజేపీ రక్షణలో ఉన్నారంటూ సెటైర్లు వేశారు. కమలం రేకులు కప్పుకున్న జగన్ కళ్లకు ఏపీలో ఎన్నికల వేళ ప్రజలు పడిన ఇబ్బందులను చూపించడం కోసమే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నానంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
అంతకు ముందు రోజు కూడా జగన్ టార్గెట్ గా లోకేష్ ట్వీట్ చేసారు. పోలింగ్ రోజున తాను పోలింగ్ బూత్ కు వెళ్లడాన్ని నిబంధనలకు విరుద్ధమంటూ జగన్ అన్నారని... పోలింగ్ సవ్యంగా జరుగుతోందో, లేదో పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుందని ఆయన అన్నారు. ఇంత మాత్రం కనీస పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుండటం మన కర్మ అనుకోవాలని చెప్పారు. ఏపీలో జగన్ ఘన విజయం సాధించబోతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఉద్దేశిస్తూ లోకేశ్ సెటైర్లు వేశారు. 'మొన్నెప్పుడో పేపర్లో చదివా. ఒక కోడి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచీ బతికేస్తుందంట. జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడు. ఈ విషయంతో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రమా చెప్పండి' అని ఎద్దేవా చేశారు.