బాలాకోట్ వైమానిక దాడుల అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈసీ ఆదేశాలను సాక్షాత్తూ దేశ ప్రధాని మోదీ ఉల్లంఘిస్తున్నారు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. పదేపదే అదే మాట మాట్లాడుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఈసీకి, రాష్ట్రపతికి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదు. బాలాకోట్ దాడైనా, మిషన్ శక్తి ప్రకటననైనా, ఉగ్రవాదంపై పోరాటమైనా, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లపై కోర్టు తీర్పు అయినా... ఏదయినా దేశ భద్రత, దేశ సైనిక బలగాలు... ఇదే ఆయన ప్రచారాయుధం! ప్రభుత్వ-వ్యతిరేకత తట్టుకునేందుకు ఆయన ప్రచార సరళిని మార్చి సైనికుల తుపాకీ మాటున గెలవాలనుకుంటున్నారన్న విమర్శలు రేగాయి.
సైనికులను అవమానించినవారు గంగలో దూకాలని విపక్షనేతలపై మోదీ తాజాగా విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రతి పౌరుడు ఆర్మీని అభిమానిస్తారన్నారు. ‘‘ సైనిక బలగాల త్యాగ నిరతిని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బాంబుదాడి నిజమేనా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. సైనికులను అవమానించినవారు గంగలో దూకి చావాలి’’ అని ఘాటుగా విమర్శించారు. ‘‘ కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడూ చాలా సార్లు ఉగ్రవాద దాడులు జరిగాయి. వారు మౌనం దాల్చారు. ఇపుడు మన సైనికులు ఉగ్రవాదుల్ని వారి గడ్డపైనే నిర్జిస్తే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సైన్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. అవమానిస్తున్నాయి. అందుకే మన విపక్ష నేతలు పాక్‌లో హీరోలు. మన నేతల వ్యాఖ్యలు ఉటంకిస్తూ పాక్ భారత్‌ను అపఖ్యాతి పాల్జేస్తోంది...’’ అన్నారు.
మోదీ తీరుపైనా, బీజేపీ ప్రచారసరళిపైనా మాజీ సైన్యాధికారులు, వివిధ దళాల్లో పనిచేసిన వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సైన్యాన్ని, సైన్యం విజయాలను రాజకీయాలకు వాడుకోవడమేంటని తప్పుబట్టారు. ఈ మేరకు 150 మంది మాజీ సైనికులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ లేఖ రాశారు. ఈ లేఖపై ఆరుగురు మాజీ సైన్యాధ్యక్షులు సంతకాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సైనిక చర్యలను ప్రస్తావించడం, రాజకీయ పార్టీల కార్యకర్తలు మిలిటరీ యూనిఫారాలు ధరించి ఫొటోలు దిగడం, భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ లాంటి వారి పోస్టర్లను ప్రదర్శించడం సరికాదని త్రివిధ దళాల మాజీ అధికారులు పేర్కొన్నారు. ఇలా.. ఏదో ఒక రూపేణా మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు ఈ దాడులను ప్రతీరోజూ వార్తలకెక్కిస్తున్నారు. సర్జికల్ దాడులను రాజకీయం కోసం వాడుకోవడం ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం.. అని విపక్షాలు విమర్శించాయి.