వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాల్సిందేనని తాము డిమాండ్ చేస్తుంటే.. శరీరంలో ఒక చోట నుంచే బ్లడ్ శాంపిల్ తీసి పరీక్షిస్తారంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా వ్యాఖ్యానించడమేమిటంటూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. బ్లడ్ శాంపిల్‌తో పోల్చడం దారుణమని, ఇటువంటి అంశాలతో ఈసీ విశ్వాసం కోల్పోతుందని, ఇది కేన్సర్‌లా మారి, డయాలసిస్ స్థాయికి చేరుకుంటుందని హెచ్చరించారు. అసలు 50 శాతం స్లిప్పులను లెక్కించడానికి ఉన్న ఇబ్బందేమిటో ఈసీ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం కర్ణాటకలో జేడీఎస్ తరపున ప్రచారం చేసిన ఆయన.. మంగళవారం చెన్నై వెళ్లి డీఎంకే కూటమికి సంఘీభావం తెలియజేశారు.
డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగిన విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంల సమస్యను రక్తపరీక్ష నమూనాతో పోల్చి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడాన్ని చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. చిన్న సమస్య, ఒకచోట గాయమైతే ఒక నమూనా సరిపోతుందని, రక్తం మొత్తం చెడిపోయినప్పుడు ప్రతి రోజూ డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈవీఎంల దుర్వినియోగం, పనితీరుతో ఈసీకి వ్యాధి ముదిరిందని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశం కోసం ఈసీ తీరుపై ఉద్యమించానని, ఇది మున్ముందు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం మాదే. అందులో సందేహమే లేదు. అయినా సరే.. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఎన్నికల్లో పారదర్శకత కోసమే పోరాడుతున్నాను. ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం. కౌంటింగ్ తర్వాత కూడా ఈవీఎంల్లో లోపాలపై పోరాటం చేస్తాను’ అని సీఎం పేర్కొన్నారు. ఈ నెల 11న జరిగిన ఆంధ్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈసీ వైఫల్యాన్ని, ఈవీఎంలలో లోపాలను ఎత్తిచూపారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేయలేదని, ఓట్లు కూడా తారుమారయ్యాయని ఆరోపించారు. ఈసీ ఘోరంగా విఫలమైందని, మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలింగ్ జరపడం చరిత్రలో ఎక్కడా లేదని, ఓటర్లు చాలా ఇబ్బందిపడ్డారని తెలిపారు. చెన్నై, బెంగళూరు, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓట్లు వేశారని, వారందరి విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈసీపై లేదా అని ప్రశ్నించారు. వీవీప్యాట్‌లో 7 సెకన్ల డిస్‌ప్లే 3 సెకన్లకు తగ్గిపోయిందని, ఎందుకిలా జరిగిందో కమిషన్ వివరణ ఇవ్వలేదన్నారు. 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు కోరుతూ.. సుప్రీంకోర్టులో కొత్త పిటిషన్ వేయబోతున్నట్లు తెలిపారు.