ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) ఇప్పటికీ లోపభూయిష్టంగానే ఉన్నాయని, వాటిని ఎవరైనా హ్యాక్‌ చేసేందుకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ పేర్కొన్నారు.రాష్ట్రంలో ఈ నెల 11న పోలింగ్‌ సందర్భంగా ఈ విషయం రుజువైందని తెలిపారు. ఓటు వేశాక వీవీప్యాట్‌లో 7 సెకన్లపాటు కనిపించాల్సిన స్లిప్‌ 3 సెకన్లే కనిపించిందంటే ఎక్కడో తేడా జరిగినట్టేనని, కోడ్‌ మారి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈవీఎంలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మళ్లీ పేపర్‌ బ్యాలెట్‌ విధానానికే వెళ్లడం మంచిదని హరిప్రసాద్ అన్నారు.

hariprasad 14042019 2

ఈవీఎం పనితీరుపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈసీ కుంటిసాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని హరిప్రసాద్‌ విమర్శించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరాకు తనకు మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. ‘‘ఈనెల 10న ఎవరో వీవీప్యాట్‌ యంత్రాన్ని ప్రదర్శిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అందులో ఏడు సెకన్లకు బదులుగా 3 సెకన్లే అభ్యర్థి పేరు, గుర్తు కనిపించాయి. ఇదే విషయాన్ని సీఈసీ వద్ద లేవనెత్తగా, టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ చైర్మన్‌ డీటీ సహానీతో చర్చించడానికి సాయంత్రం 4 గంటలకు రావాలని చెప్పారు. మేము వెళ్లాం. డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సుదీప్‌ జైన్‌ చాలా సేపు మౌనంగా ఉండిపోయారు. మీ మీద కేసు ఉంది. కేసున్న వాళ్లతో మేం ఎలా మాట్లాడతాం? అని ప్రశ్నించారు’ అని చెప్పినట్లు హరిప్రసాద్‌ వివరించారు. కేసులున్నాయని చెప్పి బెదిరించి తనను చర్చలకు దూరం పెట్టాలని ఈసీ చూస్తోందని ఆరోపించారు.

hariprasad 14042019 3

సీఎం చంద్రబాబు వెంట ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు హోదాలో హరిప్రసాద్‌ ఈసీ దగ్గరకు వెళ్లారు. ఆయన వేసిన ప్రశ్నలకు ఈసీ సమాధానాలు ఇవ్వలేక మొహం చాటేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ బృందం బయటకు వచ్చేసిన వెంటనే.. ఈవీఎంలపై చర్చకు రావాలంటూ లేఖ రాయడాన్ని నాటకంగా పేర్కొంటోంది. ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారాలను ఉప ఎలక్షన్‌ కమిషనర్‌ సుదీప్‌ జైన్‌ చూస్తారని, అతనితో పాటు మరో ప్రొఫెసర్‌ కూడా ఉంటారని తెలియజేసింది. అయితే హరిప్రసాద్‌ మాత్రం ఈ బృందంలో ఉండకూడదని చెప్పింది. దీనిపైనే టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై చర్చించాలని అంటే.. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని అదే సమయంలో అసలు హరిప్రసాద్‌కు సంబంధించిన కేసులో చార్జ్‌షీట్‌ లేదని, ఉంటే చూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈసీ వైఖరి దేనికి సంకేతమని నిలదీస్తున్నారు.

కర్ణాటకలోని మండ్యాలో జేడీఎస్‌ తరపున టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మద్దతుగా చంద్రబాబు ఇవాళ మాండ్యలో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అత్యధిక భాగం తెలుగులోనే ప్రసంగించారు. తెలుగు, కన్నడ ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉందని, రెండు రాష్ట్రాల ప్రజలు సోదరభావంతో కలిసిపోయారని తెలిపారు. ఎంతోమంది తెలుగు ప్రజలను కన్నడసీమ ఆదరించిందని అన్నారు. ఎన్టీఆర్ కు కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ అంటే ఎంతో అభిమానం అని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికీ తెలుగువాళ్లకు బెంగళూరు, మైసూరు నగరాలతో అవినాభావ సంబంధం ఉందని అన్నారు.

cbn mandya 15042019

కుమారస్వామి సుపరిపాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. ప్రధాని పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి దేవెగౌడ అని బాబు వ్యాఖ్యానించారు. బీజేపీ పెద్దలు చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేకుండాపోయిందన్నారు. మోదీని ధిక్కరించిన నేతలపై రాష్ట్రాలకు వెళ్లి మరీ దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తమపై దాడులు చేయిస్తున్న మోదీ రేపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటారని, ఇదే తన చాలెంజ్ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో దారుణమైన పరిపాలన సాగుతోందని పరోక్షంగా కేంద్రం తీరును విమర్శించారు. నోట్ల రద్దు ఒక పిచ్చి తుగ్లక్ చర్య తప్ప ఎవరికీ ప్రయోజనం కలగలేదని అన్నారు. నోట్ల రద్దు కారణంగా 3 లక్షల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.

cbn mandya 15042019

రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి ఎందుకు రూ.2000 నోటు తెచ్చారో చెప్పాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ రెండు వేల నోటు వల్ల రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందన్నారు. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, పూర్తిగా దెబ్బతినిపోయిందని మండిపడ్డారు. "నోట్ల రద్దు వల్ల దేశంలో ఎవరికైనా లాభం జరిగిందా?. మోదీ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా నష్టపోయింది. మోదీ పాలనలో మాటలకు, పనులకు ఎక్కడా పొంతన లేదు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూ. 2 వేల నోటు ఎందుకు తెచ్చారో మోదీ జవాబు చెప్పాలి. రూ. 2 వేల నోటు వల్ల రాజకీయాల్లో అవినీతి పెరిగింది. దేశ రక్షణ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం రాజీపడింది. మోదీ సూచనల మేరకే ఈసీ పనిచేస్తోంది. వీవీప్యాట్‌ స్లిప్పులు 50 శాతం లెక్కించాలని ఈసీని కోరాం. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కింపు విషయంలో మరోసారి సుప్రీంకు వెళ్తాం. ఐటీకి కేంద్రంగా బెంగళూరు అభివృద్ధి చెందుతోంది. మహిళా భద్రత అంశంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఈవీఎంలపై పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్‌ స్లిప్పులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరు ఎంత లోపభూయిష్టంగా ఉందో ఓవైపు సీఎం చంద్రబాబునాయుడు ఎలుగెత్తి చెబుతుండగా, అదే సమయంలో వీవీ ప్యాట్లో ఉండాల్సిన ఓటర్ రసీదు నెల్లూరులోని ఓ కాలేజి వద్ద పడివుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ సాంకేతిక నిపుణుడు, ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు హరిప్రసాద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నెల్లూరులోని ఓ జూనియర్ కాలేజీ వద్ద ఎవరో ఈ ఓటర్ రసీదును చూశారు. ఇది మాక్ పోలింగ్ సందర్భంగా తీసిన రసీదు అయ్యుంటుందా? అయితేమాత్రం, వీవీ ప్యాట్ నుంచి వచ్చిన ఎలాంటి రసీదునైనా భద్రపరచాల్సిన అవసరంలేదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?" అంటూ మండిపడ్డారు.

ec 15042019 1

కేంద్ర ఎన్నికల సంఘానికి సాయపడేందుకు ఎంతోమంది విజిల్ బ్లోయర్లు సిద్ధంగా ఉన్నారని, అలాంటి వాళ్లను వేధించే బదులు రక్షణ కల్పిస్తే చాలని హరిప్రసాద్ తన ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు. కాగా, ఆ ఓటర్ రసీదులో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి పేరు, ఫ్యాన్ గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరిగింది. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో 133, 134 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాలలో వీవీ ప్యాట్ స్లిప్స్ దొరికాయి. స్లిప్స్ బయటకు రావడంతో ఆర్డీవో, రెవెన్యూ సిబ్బంది షాక్ తిన్నారు. వెంటనే వాటిని సేకరించడం మొదలు పెట్టారు. వాటన్నింటిని కాల్చే ప్రయత్నం చేశారు. మీడియాలో ప్రసారం చేయొద్దని సిబ్బంది వేడుకున్నారు. నిబంధనల ప్రకారం స్లిప్పులను భద్రపరచాలి. సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ec 15042019 1

అయితే, స్లిప్పుల కలకలం అంశాన్ని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు దృష్టికి మీడియా తీసుకెళ్లింది. పోలింగ్ కు ముందు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ లో భాగంగా ఈవీఎం ద్వారా 50 ఓట్లు వేస్తారు. ఓట్లు కరెక్ట్ గా పడుతున్నాయా లేదా, ఒక గుర్తుకి ఓటు వేస్తే మరో గుర్తుకి ఓటు పడిందా, ఎన్ని ఓట్లు ఒక గుర్తుకి వెయ్యడం జరిగింది.. ఇలా అన్ని లెక్కలు రాసుకుంటారు. వీవీ ప్యాట్ స్లిప్స్ ప్రకారం ఈవీఎం పనితీరు పరిశీలిస్తారు. ఆ సమయంలో తీసిన వీవీ ప్యాట్ స్పిప్స్ ను సిబ్బంది భద్రపరచాలి. అందుకు విరుద్ధంగా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే ఈ స్లిప్స్ మాక్ పోలింగ్ కు సంబంధించినవా, లేక ఓటింగ్ జరిగిన తర్వాత వీవీ ప్యాట్ నుంచి బయటకు తీశారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాఫ్తు జరుగుతోంది. ఈ విషయం ఏపీ సీఈవో ద్వివేది దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. నివేదిక సమర్పించాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్‌, జనతాదళ్‌ మిత్రపక్షాల అభ్యర్థి, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్‌ కుమారస్వామి తరఫున మండ్యలో ఆయన ప్రచారం చేస్తారు. మండ్య జిల్లా పాండవపురలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సినీ నటి, దివంగత కన్నడ నటుడు అంబరీశ్‌ సతీమణి సుమలత పోటీ చేస్తున్నారు. సుమలతకు భాజపా బేషరతుగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారన్న సమాచారంతో తెలుగు ఓటర్లలో ఉత్సాహం మొదలైంది. బెంగళూరు, బళ్లారి, రాయచూరు, కోలార్‌, చిక్కబళ్లాపుర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తారు.

cbn 15042019

10 నెలల క్రితం కర్ణాటక విధానసభకు నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఇచ్చిన పిలుపు పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. కేంద్రం విభజన చట్టంలో ఆంధ్రకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని, దీంతో ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రభావం కర్ణాటకలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే 50కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాలపై నేరుగా పడిందని జాతీయ స్థాయిలో రాజకీయ విశ్లేషణలు వెల్లడించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలోని 40 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌ 21, భాజపా 15, బెంగళూరులోని 28 సీట్లలో కాంగ్రెస్‌ 15, భాజపా 11, బళ్లారిలోని మొత్తం 9సీట్లలో కాంగ్రెస్‌ 6 సీట్లను గెలుచుకున్నాయి. ప్రస్తుతం మండ్యలో పార్టీల కన్నా అభ్యర్థుల వ్యక్తిగత అంశాలకు ప్రచారంలో ప్రాధాన్యం లభిస్తోంది. సుమలత- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అంటూ మండ్య సిట్టింగ్‌ ఎంపీ, జేడీఎస్‌ నేత శివరామే గౌడ ఇటీవల చేసిన వ్యాఖ్య దుమారం రేపింది.

cbn 15042019

జేడీఎస్‌ నేతలు ఈ వ్యాఖ్యలకు భయపడే చంద్రబాబును ప్రచారానికి దించినట్లు భాజపా విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు ఓ సామాజికవర్గానికి చెందిన నేత మాత్రమే కాదని మాజీ ప్రధాని దేవేగౌడ భాజపా విమర్శలకు గట్టిగానే బదులిచ్చారు. ఆయన ప్రచారం కేవలం మండ్య అభ్యర్థి కోసమే కాదని, భాజపాను ఓడించే క్రమంలో ‘మహాఘట్‌ బంధన్‌’ను బలోపేతం చేసేందుకేనని జేడీఎస్‌ వర్గాలు చెప్పాయి. గత విధానసభ ఎన్నికలు, ఆపై 5 స్థానాల ఉప ఎన్నికల్లో మిత్రపక్షాల విజయం జాతీయ రాజకీయాలకు ఊతమని భావించే చంద్రబాబు మండ్యలో ప్రచారానికి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాది, కేవలం తెలుగు ఓటర్ల వల్లే అధికారానికి అతి దగ్గరగా వచ్చి ఓడిపోయామని, దానికి చంద్రబాబు ప్రచారామే కారణం అని బీజేపీ ఇప్పటికే చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభావం, ఎంపీ సీట్ల పై ఏ మాత్రం ఉంటుందో అని బీజేపీ అంచనా వేస్తుంది.

Advertisements

Latest Articles

Most Read