ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చే అవకాశముందని మరో సర్వే స్పష్టం చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ.. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో తమ నెట్వర్క్ ఉన్న ‘కార్పొరేట్ చాణక్య’ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. టీడీపీ 98 నుంచి 101 స్థానాలు గెలుచుకుంటుందని.. వైసీపీ 71 స్థానాల వద్ద ఆగిపోతుందని అంచనా వేసింది. జనసేనకు 3 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. ఫిబ్రవరి 14 - ఏప్రిల్ 3వ తేదీ మధ్య ఈ సంస్థ ప్రజాభిప్రాయం సేకరించింది. నియోజకవర్గానికి 4వేల నుంచి ఐదు వేల మంది ఓటర్లను ప్రశ్నించింది. ఓటరు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాడని.. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే టీడీపీ 110 స్థానాలకుపైగా గెలుచుకోవచ్చునని ‘కార్పొరేట్ చాణక్య’ అంచనా వేసింది. సర్వేలో భాగంగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నించగా.. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని 53.8 శాతం మంది చెప్పినట్లు వెల్లడించింది.
ఇక నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఎవరు కావాలని కోరుకుంటున్నారని అడగ్గా.. అత్యధికులు చంద్రబాబుకే మద్దతు తెలిపారు. 48.3 శాతం మంది మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని చెప్పగా.. 41.1 శాతం మంది జగన్ కావాలని అభిప్రాయపడ్డారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం కావాలని కేవలం 6.4 శాతం మంది కోరుకోవడం గమనార్హం. మూడు నెలల కిందటి దాకా స్థానికంగా అభ్యర్థుల మధ్య ‘నువ్వా - నేనా’ అనే పోటీ నెలకొంది. ఇప్పుడు... అత్యధిక ఓటర్లు ఈ ఎన్నికలను చూసే దృక్కోణం మారిపోయింది. స్థానిక అంశాలు, అభ్యర్థులకంటే... ‘రాష్ట్రం - అభివృద్ధి’ అనేదే ఎన్నికల అజెండాగా మారింది. దీనిని అత్యధికులు ‘చంద్రబాబు వర్సెస్ జగన్’ మధ్య పోరుగా చూస్తున్నారు. తెలుగుదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పలుచోట్ల స్థానిక నేతలపై ఉన్న వ్యతిరేకత. అదేసమయంలో చంద్రబాబుపై ఉన్న సానుకూలత దీనిని తటస్థం చేస్తోంది.
అభ్యర్థుల ఎంపికలో టీడీపీ ఆచితూచి వ్యవహరించింది. 43 శాతం సిట్టింగ్‌లను మార్చడంతో ‘స్థానిక అభ్యర్థులపై వ్యతిరేకత’ను బాగా తగ్గించుకోగలిగింది.ముస్లిం మైనారిటీల్లో టీడీపీకి ఆదరణ పెరిగింది. గతంతో పోల్చితే సుమారు 15 శాతం మంది అదనంగా ‘సైకిల్’ వైపు చూస్తున్నారు. వైసీపీతో బీజేపీ కుమ్మకైందని నమ్మడం దీనికి ప్రధాన కారణం. గతంతో పోల్చితే ఎస్సీల్లో 5 నుంచి 8 శాతం ఓటర్లు అదనంగా టీడీపీ వైపు చూస్తున్నారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీల ఓటును జనసేన చీల్చుతోంది. మొదటి నుంచీ కాంగ్రె్‌సకు మద్దతుదారులుగా ఉండి తర్వాత వైసీపీకి బదిలీ అయిన ఎస్సీ మాల ఓటు మీద జనసేన ప్రభావం ఉంది. ఈ వర్గం వారు జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారని సర్వేలో తేలింది. ‘మాస్ లీడర్’ను అనుసరించే వారి ఓటు పవన్, జగన్ మధ్య చీలిపోతోంది. గతంలో... ఈ వర్గం ఓట్లు అత్యధికం జగన్‌కే పడ్డాయి. వెరసి, పవన్ దూరం కావడంవల్ల టీడీపీకి నష్టం జరుగుతుందన్న అంచనాలో నిజం లేదు.