బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె. అడ్వాణీ మరో ఇరవైరోజులు ఆగివుంటే బ్లాగులో ఆయన చేయిచేసుకొని ఐదేళ్ళు పూర్తయ్యేది. ఈ కాలంలో బ్లాగులు ఎవరు చదువుతార్లే అని ఊరుకున్నారో, మోదీ పాలనమీద వ్యాఖ్యానించేందుకు ఇంతకాలమూ ఏ ఒక్క అంశమూ దొరకలేదో తెలియదు కానీ, ఇప్పుడు హఠాత్తుగా ఓ ఐదువందల పదాలు సంధించి మోదీని సరైన సమయంలో శిక్షించారు. ఇంతటి మంచిమాటలు, ఇన్నేసి హితవులు వల్లించడానికి అడ్వాణీ అర్హుడేనా అన్న విమర్శ అటుంచితే, ఆయన మాటలన్నీ వర్తమానానికి సరిగ్గా వర్తించేవే. మోదీమీద అక్కసుతోనైనా అడ్వాణీ వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలతో విభేదించాల్సిందేమీ లేదు. అడ్వాణీ మితభాషీ కాదు, మృదుభాషీ కాదు. నీళ్ళు నమలడం చేతకాదు. అనుకున్నది నేరుగా పదునుగా చెప్పగలిగే తెగువ ఆయనలో ఉంది. ఇందుకు భిన్నంగా, ఎంతోకాలం తరువాత రాసిన ఈ నాలుగువాక్యాలు కూడా నర్మగర్భంగా, బీజేపీ అలాలేదు, ఇలా చేయలేదు అంటూ సుతిమెత్తని మాటలతో సాగాయి. తన రచన రాజకీయంగా రచ్చరేపుతుందనీ, స్వపక్ష మోదీని ఇరకాటంలో పడేస్తుందనీ, మోదీ వ్యతిరేకశక్తులకు ఆయుధంగా ఉపకరిస్తుందని అడ్వాణీకి తెలుసు.
పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చివున్నా, అమిత్ షా ఎగరేసుకుపోయిన గాంధీనగర్ స్థానమో, మరొక నియోజకవర్గమో దక్కివున్నా అడ్వాణీ మరో ఐదేళ్ళపాటు బ్లాగువైపు కన్నెత్తిచూసేవారు కాదేమో! పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు ఏటా వస్తూనే ఉన్నాయి కనుక, ఈ హితవు చెప్పడానికి అడ్వాణీ గత సందర్భాలనూ వాడుకొని ఉండవచ్చు. అడ్వాణీ రచన వెనుక వర్తమాన పరిస్థితులపై ఆవేదన కన్నా, పార్టీ తనను పక్కన బెట్టిందన్న అక్కసు అధికంగా పనిచేసిందన్న విమర్శ కాదనలేనిది. ‘దేశం ముందు, పార్టీ తరువాత, చివరకు నేను’ అంటున్న అడ్వాణీ ఈ రచనతో ఎన్నికల ముందు పార్టీని దెబ్బతీసి, ‘నేనే ముందు, పార్టీయే తరువాత’ అని తేల్చేశారని మోదీ వర్గం విమర్శ. పార్టీలో ఉంటూనే నచ్చినపార్టీకి ఓటేయ్యండన్న పరోక్ష సందేశం ఎలా ఇస్తారన్న ప్రశ్న కూడా సరైనదే. అద్వానీ రచనకు ప్రతిస్పందనగా ‘మా బాగా చెప్పారు’ అంటూ మోదీ కాస్తంత వ్యంగ్యంగా ఏవో వ్యాఖ్యలు చేసి నష్టనివారణకోసం ఓ తెలివైన ప్రయత్నం చేసిప్పటికీ పెద్ద ప్రయోజనం లేకపోతున్నది. బీజేపీ విలువలుగా ఏకరువుపెట్టినవన్నీ అడ్వాణీ కాలంలో కనిపించాయా? అన్న ప్రశ్న అటుంచితే, మోదీ హయాంలో రాజకీయం మరింత దిగజారి, సమస్త వ్యవస్థలు దెబ్బతినిపోయిన ఈ సంక్షోభ సందర్భంలో ఈ మాటలకు ఎంతో విలువ ఉన్నది.
భిన్నత్వం, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువల గురించి ఆయన తగిన సమయంలో మాట్లాడారు. మోదీ పక్షాన ఉన్నవారు మాత్రమే దేశభక్తులుగా, మిగతావారంతా దేశద్రోహులని బీజేపీ నాయకులు నిర్లజ్జగా ముద్రవేస్తున్న దశలో అడ్వాణీ మాటలు ఇటువంటివారిపై ప్రభావం చూపితే సంతోషించాల్సిందే. ప్రత్యర్థులకూ, శత్రువులకూ మధ్య తేడా చెరిపేస్తూ విపక్ష నేతలపట్ల మోదీ–షా ప్రదర్శిస్తున్న కరుకువైఖరిని ప్రశ్నించడం సముచితమైనదే. ఈ మంచిమాటలేవో ఆయన ఎప్పుడో చెప్పివుంటే తన తొలిప్రాధాన్యం దేశానికే, ఆ తరువాతే పార్టీ అన్న అభిప్రాయానికి మరింత విలువ, గౌరవం దక్కేవి. ఈ ఐదేళ్ళకాలంలో మోదీ ప్రభుత్వం తమకు నచ్చనివారిని వరుసపెట్టి దేశద్రోహ నేరంపై జైళ్ళలోకి నెట్టినప్పుడు, కుట్రకేసులు బనాయించినప్పుడూ, గోరక్షణ పేరిట మైనారిటీలపై మూకదాడులు సాగినప్పుడు, న్యాయవ్యవస్థ, సీబీఐ సహా పలు వ్యవస్థలు దెబ్బతినిపోతున్నప్పుడు ఆయన ఇలా నోరువిప్పివుంటే బాగుండేది. ఈ విలువలను గుర్తుచేసి, పార్టీని గాడినపెట్టడానికి మార్గదర్శక్మండల్లో ఉన్న ఆయన ముందుకు వందలాది సందర్భాలొచ్చాయి. సమస్యలు, సంక్షోభాలు దేశాన్ని కుదిపేస్తున్న ఏ తరుణంలోనూ నోరువిప్పని ఆయన ఇప్పుడు ఇవీ మనం పాటించాల్సిన విలువలంటూ గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా ఆయన నోరుతెరిచినందుకు అభినందించాల్సిందే. మరో నలుగురు ఆ బాటలో నడిచి నాలుగు మంచిమాటలు చెబితే దేశానికి మంచిదే.