జగన్ పార్టీలో చేరిన వారం రోజుల లోపే, మోహన్ బాబుకు షాక్ తగిలింది. ఆ పార్టీ వారసత్వం లాగా, కోర్ట్ మొట్టికాయలు మొదలయ్యాయి. వైసీపీ నేత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు తీర్పునిచ్చింది. చెక్‌బౌన్స్ కేసులో మోహన్‌బాబుకు ఈ శిక్ష పడింది. శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానా కూడా కోర్టు విధించినది. 2010లో చెక్‌బౌన్స్ కేసు వ్యవహారంలో నిర్మాత వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్, ఏ2గా మంచు మోహన్‌బాబుగా కోర్టు తేల్చింది. రూ. 48 లక్షలు చెక్ బౌన్స్ వ్యవహారంపై చౌదరి కోర్ట్‌కు వెళ్లారు. 2010 సంవత్సరంలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. కాగా ఇందుకు సంబంధించి మంచు ఫ్యామిలీ ఇంత వరకూ స్పందించలేదు.
ఇది ఇలా ఉంటే, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు మండిపడ్డారు. ఇటీవల మీడియా సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. మోహన్‌బాబును ఊసరవెల్లితో పోల్చారు. మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించినందుకు ఎన్టీఆర్‌కు ఇవ్వాల్సిన పారితోషికం ఎగ్గొట్టిన మోహన్‌బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతి స్టేట్మెంట్ ఇస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బుద్దావెంకన్న సవాల్ చేశారు. దీనిపై మోహన్‌బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు..
‘‘టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి.. ఎలెక్షన్స్ ఉండేది ఇంకో పది రోజులే.. దాని తర్వాత.. మీరు మా ఇంటికి రావాలి.. మేము మీ ఇంటికి రావాలి.. ఒకళ్లనొకళ్లు ముఖాలు చూసుకోవాలి. ఎలక్షన్స్‌లో మీరూ విమర్శించొచ్చు.. మేము మిమల్ని విమర్శించొచ్చు, కానీ డీసెన్సీ ఉండాలి. అన్నిటికీ ఒక హద్దు ఉంటుంది. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చిపోకండి’’ అంటూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు.