మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీకి బీజేపీ నాయకత్వం టికెట్ నిరాకరించింది. పార్టీ 184 మందితో ప్రకటించిన మొదటి జాబితాలో ఆయన పేరు లేదు. ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గాంధీనగర్ నుంచి బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ అయిన అమిత్ షా పేరును ప్రకటించడం పాత తరానికి చెందిన పార్టీ శ్రేణుల్ని విస్మయానికి గురిచేసింది. గత 6 పర్యాయాలుగా ఆడ్వాణీ గాంధీనగర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విశేషమేమంటే తొలినాళ్లలో అమిత్ షా- ఆడ్వాణీకి గాంధీనగర్‌లోనే పోలింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఓ ఆరెస్సెస్ నేత గతవారం ఆడ్వాణీ నివాసానికి వెళ్లి బీజేపీ నిర్ణయాన్ని ఆయనకు తెలియపర్చినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. వయసు పైబడ్డ దృష్ట్యా ఆయనను ఎంపిక చేయలేదని ఆయన చెప్పినట్లు సమాచారం. బయటికి మాత్రం ఆడ్వాణీయే పోటీకి విముఖత ప్రదర్శించారని బీజేపీ ప్రచారం చేసింది. బీజేపీ దశ దిశలను మార్చి ఓ పటుతర రాజకీయ శక్తిగా నిలిపిన ఈ 91-ఏళ్ల అగ్రనాయకుణ్ని బీజేపీ నాయకత్వం దాదాపుగా వెళ్లగొట్టిందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
పోటీ చేయడం, చేయకపోవడం అనేది ఆయన ఇష్టానికే వదిలేసినట్లు నిన్న మొన్నటి దాకా బీజేపీ అధికారికంగా నమ్మబలికింది. అయితే గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ నాయకత్వం ఆయనను అడగనే లేదని, ఆయన కూడా తాను పోటీచేస్తానని వారికి చెప్పలేదని, ఆయన స్థాయికి అలా అడుక్కోవడం సరికాదని ఆడ్వాణీ వ్యక్తిగత కార్యదర్శి దీపక్ చోప్రా మంగళవారం వ్యాఖ్యానించడంతో పార్టీ ఆయనను దూరం పెట్టిందన్న సంకేతాలు వెలువడ్డాయి. 1989-92 ప్రాంతాల్లో సోమ్‌నాథ్- అయోధ్య రథయాత్రను చేపట్టి ఆడ్వాణీ బీజేపీని ఓ బలవత్తర రాజకీయ పార్టీగా మార్చడంలో సఫలమయ్యారు. హిందూత్వానికి ప్రతీక అయ్యారు. 1991లో విఫలమైనా 1998, 1999ల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆడ్వాణీ మార్గం ఉపకరించింది.
వాజ్‌పేయి ప్రధాని అయినపుడు ఆడ్వాణీ ఉప ప్రధాని పదవిని కూడా అలంకరించారు. హోంమంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో ఓ వెలుగువెలిగిన ఆడ్వాణీ 2014లో మోదీ ప్రభంజనం తరువాత మసకబారిపోయింది. పార్టీపై పట్టు పెంచుకోవడానికి అమిత్ షాను అధ్యక్షుఢిగా చేసిన మోదీ- ఆ క్రమంలో ఆడ్వాణీని, మరో ఇద్దరు సీనియర్ అసమ్మతి నేతలు - మురళీ మనోహర్ జోషి, శాంతకుమార్ వంటి వారిని ‘మార్గదర్శక్ మండల్’ పేరిట మూల కూర్చోబెట్టారు. ఈ మండలి ఎన్నడూ సమావేశమైనది లేదు. పైపెచ్చు, ఆడ్వాణీని ఓ మీటింగ్‌లో మోదీ అసలు పలకరించకుండా చూసీ చూడనట్లు వెళ్లిపోయి నట్లు వీడియోలు వెలువడ్డాయి.