ఉద్యోగంలో ఉన్నంత వరకు పోలీసు మార్కు చూపించానని, ఇకపై రాజకీయాల్లో ఖద్దరు మార్కు ఏమిటో చూపిస్తానని విశాఖపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోన తాతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే ఉత్తమ పార్లమెంట్ నియోజకవర్గంగా విశాఖను తీర్చిదిద్దుతానన్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్నికలైన తర్వాత కనిపించకుండా వెళ్లిపోయే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైతే విశాఖ ప్రజలకు ఇక్కడే ఉంటానని బాండ్‌పేపర్‌పై రాసిస్తానని ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా తిరిగి జనసేనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని గుర్తించిన తరువాతే ఆ పార్టీలో చేరానన్నారు. విశాఖను భూకబ్జాలు, అక్రమాలు, అన్యాయం లేని అత్యంత ఆనంద నగరంగా మారుస్తానన్నారు. మరాఠా యోధుడు శివాజీ అతి తక్కువ సైన్యంతో మొఘల్ సామ్రాజ్యాన్ని జయించిన మాదిరిగా జనసేన పార్టీ కూడా తక్కువమంది కార్యకర్తల బలంతోనే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు, ఎంపీగా పోటీ చేయాలంటే రూ.100 కోట్లు ఉండాలంటున్నారని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో విశాఖ తూర్పు అసెంబ్లీ అభ్యర్థి కోన తాతారావు, పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్, బొలిశెట్టి సత్య పాల్గొన్నారు. విశాఖ లోక్‌సభ స్థానానికి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆస్తులు మొత్తం రూ.8.66 కోట్లగా నివేదించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో నామినేషన్ వేసిన ఆయన ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు.