తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 36 ఏళ్లు. తెలుగువారి ఆరాధ్య నట నాయకుడు ఎన్టీఆర్ 1982లో స్థాపించిన ఈ పార్టీ ఇప్పటి దాకా మిత్ర పక్షాలతో కలిసే బరిలోకి దిగింది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర కోసం లేదా రాష్ట్ర, రాజకీయ అవసరాల కోసం టీడీపీ ప్రతిసారీ మిత్రులతో జత కట్టింది. చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తోంది! రాష్ట్రంలో మిత్రపక్షాల ప్రభావం ఉన్నా.. లేకపోయినా గతంలో ఎక్కువసార్లు వాటితో కలిసే ఎన్నికల బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ.. ఘనవిజయం సాధించిన సందర్భాల్లో మిత్రపక్షాలూ లాభపడ్డాయి. ఆ పార్టీ ఓడిపోయినప్పుడు అవీ నష్టపోయాయి. తెలుగుదేశం పొత్తుల కథాక్రమం ఇదీ.. ఆరంభం: 1983లో మేనక పార్టీతో... 1982లో పార్టీ ఆవిర్భావం తర్వాత 1983లో తొలిసారి పోటీ చేసినప్పుడు టీడీపీకి సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ మిత్రపక్షం. మేనకా గాంధీ అధ్యక్షురాలిగా ఉన్న ఆ పార్టీకి ఎన్టీఆర్ 5 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆఖరు: 2014.. బీజేపీతో.. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాలకు విడివిడిగా జరిగాయి.
విభజన తర్వాత నవ్యాంధ్రకు కేంద్రం సహకారం అవసరమన్న అభిప్రాయంతో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొంది. ఈ కూటమి ఆంధ్రలో గెలిచి అధికారంలోకి వచ్చింది. కానీ, నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న అభిప్రాయంతో నాలుగేళ్లకే ఆ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐతో పొత్తు పెట్టుకొని ఓడిపోయింది. తాజా ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. 1984.. బీజేపీతో పొత్తు.. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా దేశమంతా ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి. ఏపీలో మాత్రం టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీకి దేశం మొత్తం మీద రెండు సీట్లు లభిస్తే అందులో ఒకటి టీడీపీ కూటమి భాగస్వామిగా హన్మకొండ నుంచి దక్కడం గమనార్హం. లోక్‌సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. 1989.. అందరినీ కలిపి.. తానోడి.. 1989 ఎన్నికల్లో కూడా అదే కూటమి కొనసాగింది. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవడంతో ఇక్కడా ఆ పొత్తు కొనసాగింది. కానీ, రాష్ట్రంలో కూటమి ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. 1994.. జన ప్రభంజనం... 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనం వీచింది. టీడీపీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసింది. కానీ, అందులో బీజేపీ లేదు. లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించింది.
1995.. చీలిన టీడీపీ.. 1995లో టీడీపీ రెండుగా చీలిపోయి ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 1996 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా యునైటెడ్ ఫ్రంట్ ఆవిర్భావానికి చంద్రబాబు కృషి చేశారు. 1998లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. టీడీపీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. అదే సమయంలో కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 1999.. మళ్లీ అధికారం.. 1999లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేశాయి. ఆ కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యారు. 2004.. బీజేపీతో.. 2004లో మరోసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిసి వచ్చాయి. అప్పుడూ టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత బీజేపీకి టీడీపీ రాంరాం చెప్పింది. 2009.. కూటమి విఫలం.. 2009లో అన్ని పక్షాలతో కూటమి నిర్మాణానికి టీడీపీ ప్రయత్నించింది. టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. కానీ నెగ్గలేకపోయాయి.