పదవులొద్దు.. ప్రజల ఆకాంక్షలే తనకు ముఖ్యమని తేల్చి చెప్పిన వంగవీటి వారసుడికి అరుదైన గౌరవం కలిపించింది టీడీపీ. తెలుగు దేశం స్టార్ క్యాంపెయినర్ గా రాధాకు అవకాశం కలిపించింది. దీంతో టీడీపీ తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారు వంగవీటి రాధా. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, టీడీపీతో జరగబోయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే..వైసీపీలో వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నారు రాధా. వాస్తవానికి వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసింది టీడీపీ. కానీ, పార్టీ ఆఫర్ ను రాధా సున్నితంగా తిరస్కరించటంతో..కోరుకున్న చోట సీటు కేటాయిస్తామని ప్రతిపాదించింది. అయితే…రాధా మాత్రం తాను పదవులు ఆశించి పార్టీలో చేరలేదని తేల్చి చెప్పేశారు.
ప్రజల ఆశయాలతో పాటు తన తండ్రిని అవమానించిన వైసీపీ ఓటమే తన లక్ష్యమని క్లారిటీ ఇచ్చారాయన. రంగా ఆశయాల సాధన కోసం…రాష్ట్ర పగతి కోసం టీడీపీకి తోడుగా ఉంటానని అంటున్నారు. విజయవాడలో పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు అందించటం రంగా కలని గుర్తు చేసిన రాధా..తన తండ్రి కల వాస్తవ రూపంలోకి రావాలంటే టీడీపీ అధికారంలోకి రావటం తప్పనిసరి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా తాను టీడీపీకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని చంద్రబాబును కోరారు. రాధా విన్నపంపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు వంగవీటి రాధాను టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించారు.
రాధా ఎన్నికలకు దూరంగా ఉంటూనే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి జగన్ తీరును ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. సామాజిక సమీకరణాల నేపధ్యంలో వంగవీటి రాధా ప్రచారం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణా జిల్లాలోనూ రెండు భిన్న ధ్రువాలు ఏకం కానున్నాయి. ఈ ప్రభావం టీడీపీ విజయానికి దోహదం చేస్తుందని పార్టీ భావిస్తోంది. రాధా ప్రధానంగా కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో పక్క, విజయవాడలో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఉన్న విభేదాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రస్తుతం ఇరు కుటుంబాల వారసులు వంగవీటి రాధా, దేవినేని అవినాష్ లు ఇద్దరూ ఒకే వేదిక పైకి వచ్చారు.