మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విచారిస్తున్నారు. ఈ రోజు పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి ఆయన వచ్చారు. వివేకా హత్యపై అవినాష్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. విచారణకు పిలిస్తే వెళ్లానని, పోలీసులు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పానని అవినాష్ మీడియాకు తెలిపారు. అయితే, వివేకా కేసును స్థానిక సీఐ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా మృతి తర్వాత సీఐతో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని తెరపైకి తెస్తున్నారంటూ మండిపడ్డారు.
వివేకానందరెడ్డి దారుణ హత్య మిస్టరీగానే ఉంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఐదు బృందాలను నియమించి విచారణ వేగవంతం చేసింది. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పర్యవేక్షణలో మరో ఏడు బృందాలు ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు 20 మంది సాక్షులను విచారించారు. ఏ అంశాన్నీ వదలకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పులివెందుల పోలీసుస్టేషన్‌కు వివేకా దగ్గరి బంధువులు ఆరుగురిని పిలిపించి విచారణ జరిపి వారి నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. నిన్న వివేకా సోదరులు భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డి, జగన్ అనుచరుడు శంకర్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు వివేకా బంధువులకు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
వివేకా గుండెపోటుతో మరణించారని ఎందుకు చెప్పారు? పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మీరే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? బాత్రూంలో పడి ఉన్న వివేకాను ఎందుకు బెడ్ రూంలోకి తీసుకువచ్చారు? రక్తపు మరకలను ఎందుకు తుడిచారు? బలమైన గాయాల వివేకా శరీరంపై ఉంటే గుండెపోటుతో మృతి చెందాడని ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఇలాంటి ప్రశ్నలను సిట్ బృందం వివేకా బంధువులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కడప జిల్లా పులివెందులలోని తన ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను గొడ్డలితో నరికి చంపారు. గురువారం రాత్రి మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి వచ్చిన ఆయన... శుక్రవారం ఉదయానికి తన నివాసంలోనే శవంగా కనిపించారు. ఎన్నికల వేడి రాజుకుంటున్న ఈ సమయంలో జరిగిన హత్య... రాజకీయంగానూ సంచలనం సృష్టిస్తోంది.