వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడున్నరేళ్లకి పైగా పాలనలో 22 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ గురించి ఏమాత్రం ఆలోచించని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. రాష్ట్రంలో సామాన్యప్రజలకు రక్షణలేదు, చివరికి మహిళల మానప్రాణాలను కాపాడలేని సర్కారు ఉండి ఏం ప్రయోజనం అని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో 22వేల మందికి పైగా మహిళల మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయని పార్లమెంటు సాక్షిగా కేంద్రం గణాంకాలు వెల్లడించడం రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులకు అద్దంపడుతోందన్నారు. రాష్ట్రంలో మహిళల దుస్థితి కేంద్రం వెల్లడిస్తే, వైకాపా ఎంపీలకు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. మిస్సింగ్ కేసుల్లో దేశంలోనే ఏపీ మూడోస్థానంలో ఉందని కేంద్రం నివేదిక వెల్లడించాక కూడా కనీసం సమీక్ష చేయాలనే ఆలోచన రాని ముఖ్యమంత్రి ఉండటం మన దౌర్భాగ్యం అని అనిత ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలపై హత్యలు, హత్యాచారాలు, మిస్సింగ్ లు, మాధకద్రవ్యాల కేసుల్లో ఏపీని నెంబర్1గా నిలిపినందుకు వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు స్పందించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో డెకాయిట్ కేసులు 85శాతం పెరిగాయని దీనికి రాష్ట్ర ప్రభుత్వం తీరే కారణమని ఆరోపించారు. వైసీపీ వికృత చేష్టలు చూసి ఎప్పుడు ఎన్నికలు వస్తాయి? చంద్రబాబును సీఎం కుర్చీలో ఎప్పుడు కూర్చోబెట్టాలని మహిళలు చూస్తున్నారన్నారు. వైసీపీ నుండి కనీసం ఇంగిత జ్ఞానం లేనివాళ్లు అసెంబ్లీలో, పార్లమెంటులో కూర్చోవడం రాష్ట్ర మహిళలు చేసుకున్న దౌర్భాగ్యం అని అనిత ఆవేదన వ్యక్తం చేశారు.